ప్రజలకు ఇబ్బందులు రాకూడదు!
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:41 AM
‘ఆర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అత్యున్నత సన్నద్ధత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు
ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించాలి
మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలి
అన్ని స్థాయుల్లో సమన్వయంతో పని చేయాలి
పునరావాస కేంద్రాల్లో వసతులు కల్పించాలి
అధికారులకు సీఎం దిశానిర్దేశం.. సమీక్ష
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అత్యున్నత సన్నద్ధత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలూ సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్దేశించారు. అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాల్లో సన్నద్ధతపై ఆదివారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్‌గుప్తా, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ’తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. తుఫాన్ ప్రభావంపై ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారం ఇచ్చి, అప్రమత్తం చేయాలి. ఎప్పటికప్పుడు ముందస్తు సూచనలు, హెచ్చరికలు జారీ చేయాలి. ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదు. ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయుల్లో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పని చేయాలి. ప్రభుత్వ సూచనలు పాటించేలా తీర ప్రాంత గ్రామాల ప్రజలను ఒప్పించాలి. శాటిలైట్ సమాచారంతో సైంటిఫిక్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి నాలుగు గంటలకూ తుఫాన్‌పై బులెటిన్ విడుదల చేయాలి.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చోట సహాయ, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్యం అందించాలి. తాగునీరు, ఆహారం పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలి. వీటికి నిధుల కొరత లేకుండా కలెక్టర్లు చూసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలు ఉండాలి. ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు కూడా రాకూడదు. ముందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి’ అని సీఎం నిర్దేశించారు. ‘తుఫాన్ వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్ధతతో ఉండి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా చూడాలి. గాలుల వల్ల సెల్‌ఫోన్ నెట్‌వర్క్ దెబ్బతింటే.. వెంటనే పునరుద్ధరించేలా ఏజెన్సీలను సిద్ధం చేయాలి. ఈ విషయంలో జాప్యాన్ని సహించవద్దు’ అని అన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన అన్ని బోట్లూ తీరానికి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో వచ్చే వరద నీటితో రిజర్వాయర్లలో నింపేలా ఇరిగేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి తుఫాన్ ప్రభావం మొదలై, రాకపోకలకు అటంకం కలిగితే గర్భిణులు ఇబ్బందులు పడతారని, ఈ వారంలో కాన్పు అయ్యే గర్భిణులను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. తుఫాన్ సహాయ చర్యల కోసం 10ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెప్పారు. వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్, హోం, ఫైర్, ఇరిగేషన్, పౌరసరఫరాలశాఖల అధికారులు సన్నద్ధత చర్యలను సీఎంకు వివరించారు.
భారీగా వర్షపాతం నమోదుకు చాన్సు
ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 850, కాకినాడకు 930కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం సోమవారానికి తుఫాన్‌గా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫాన్‌గా, మంగళవారానికి అతితీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సీఎంకు చెప్పారు. 28న ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల- విశాఖ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, ప్రస్తుత అంచనాల్లో కోనసీమ-యానం-కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటొచ్చని వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 29.25, అల్లూరి 28.11, విశాఖ 25.3.8, శ్రీకాకుళం 24.98 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు వర్షపాతం 9.5 సెంటీమీటర్లు, తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సగటున 22-29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అంచనా ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం