TAX: పన్ను తగ్గిస్తే మాకేమిస్తారు ?
ABN , Publish Date - May 21 , 2026 | 11:46 PM
ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను ఇతర ఎలాంటి పన్నులైనా తగ్గిస్తాం మాకేం ఇస్తారు అంటూ కొందరు మున్సిపాల్టీలోని సచివాలయ సిబ్బంది బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని కొందరు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ప్రజలతో కొందరు సచివాలయ సిబ్బంది బేరసారాలు
మున్సిపల్ పరిధిలోని సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
సోషల్ మీడియాలో అవినీతి స్ర్కీనషాట్ల హల్‌చల్
కళ్యాణదుర్గం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను ఇతర ఎలాంటి పన్నులైనా తగ్గిస్తాం మాకేం ఇస్తారు అంటూ కొందరు మున్సిపాల్టీలోని సచివాలయ సిబ్బంది బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని కొందరు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది అవినీతి గురించి ఆధారాలతో సోషల్ మీడియాలో చే సిన కొన్ని పోస్టులు ఇటీవల హల్‌చల్ చేశాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలో 11 సచివాలయాలు ఉన్నాయి. దాదాపు అన్ని సచివాలయాలలోను అడ్మిన్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయంలో పన్నులు పెంచడం, తగ్గించడం, ప్రాపర్టీ విభజన, టైటిల్ ట్రాన్సఫార్మర్ వంటి పనులు సచివాలయ అడ్మిన్లే చేస్తుంటారు. ఏ పని జరగాలన్నా ఆ పనికి తగ్గ మొత్తం నగదు రూపంలో కానీ ఫోనపే ద్వారా కానీ చెల్లిస్తే తప్ప పనులు జరుగవని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
ఇటీవల కొందరు ఫోనపే ద్వారా అధికారులకు ఇచ్చిన లంచం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్ర్కీనషాట్లు హల్‌చల్ చేశాయి. ఈ అవినీతి సొమ్ములో కమిషనర్, రెవెన్యూ ఇనస్పెక్టర్, మేనేజర్‌కు కూడా వాటాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే వారు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ తీరు కూడా అవినీతిని ప్రోత్సహించేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో సచివాలయ సిబ్బంది ఒకరు పింఛన డబ్బులతో ఉడాయించినా అతనిపై చర్యలు తీసుకోకపోగా సెలవుపై పంపి, జీతం కూడా ఇప్పించడమే ఇందుకు నిదర్శనం. మున్సిపల్ కార్యాలయం వేదికగా పంచాయితీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....