HOSPITAL: సమావేశాలే లేవు
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:39 PM
గత వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండా పూర్తిగా పక్కన పెట్టిన వ్యవహారం ఇప్పుడు కూడా మారలేదు. ప్రభు త్వం మారినా కమిటీ పనితీరు మారకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
- అలంకారప్రాయంగా అభివృద్ధి కమిటీలు
- ఆసుపత్రుల్లో పేరుకుపోయిన సమస్యలు
బొమ్మనహాళ్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండా పూర్తిగా పక్కన పెట్టిన వ్యవహారం ఇప్పుడు కూడా మారలేదు. ప్రభు త్వం మారినా కమిటీ పనితీరు మారకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కమిటీ కేవలం పేరుకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఆసుపత్రుల అభివృద్ధి, రోగులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీలు మండలంలో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఐదేళ్లపాటు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వం మారిన తర్వాతైన పరిస్థితుల్లో మార్పు వస్తుందని ప్ర జలు ఆశించినా అదే నిర్లక్ష్యం కొనసాగుతండటం గమనార్హం. ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా కమిటీ సమావేశాలు జరగకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మండలంలో మండల కేంద్రం తోపాటు శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరుల్లో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో తాగునీరు, శుభ్రత, సిబ్బంది కొరత తదితర సమస్యలపై చర్చించే వేదిక లేకుండా పోయింది. అభివృద్ధి కమిటీ సమావేశాలు జరగకపోవడంతో సమస్యలు పేరుకుపోయి, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమావేశాలు నిర్వహించి ఆసుపత్రుల పరిస్థితిని సమీక్షించకపోతే సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రజలు అంటున్నారు. కమిటీ వ్యవస్థను పునరుద్ధరించి రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....