రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:20 AM
హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.
సత్యసాయి జిల్లా: హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు ఎంతో కీలకమైన మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.790 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. మడకశిర బ్రాంచ్ కెనాల్ హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు వరప్రదాయినిగా మారనుందని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక కృషి వల్లే ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరై, నేడు పనులు ప్రారంభించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 2014–19 మధ్య తమ ప్రభుత్వం రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించి రాయలసీమకు అన్యాయం చేసిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని, అందులో రాయలసీమకే రూ.12,900 కోట్లు, అంటే మొత్తం వ్యయంలో 51 శాతం నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. హంద్రీ–నీవా కాలువ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,800 కోట్లు వెచ్చించి 728 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపించేందుకు గతంలో ఎన్టీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.