GRABBING: యథేచ్ఛగా మట్టి దోపిడీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:46 PM
మండల పరిధిలోని శ్రీరంగాపురం రంగమ్మ చెరువులో అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువులోని ఒండ్రుమట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పది రోజుల నుంచి ఎక్స్‌కవేటర్లు పెట్టి తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.
- టిప్పర్ రూ. రెండు వేలకు విక్రయం
బెళుగుప్ప, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని శ్రీరంగాపురం రంగమ్మ చెరువులో అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువులోని ఒండ్రుమట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పది రోజుల నుంచి ఎక్స్‌కవేటర్లు పెట్టి తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు. ఒకొక్క టిప్పర్ మట్టిని రూ. 1800 నుంచి రూ. రెండు వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒకొక్క నాయకుడు ఐదారు టిప్పర్‌లతో ఒండ్రుమట్టి తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులో సుమారు పది అడుగులకు పైగా లోతు తవ్వడంతో పెద్ద పెద్ద చెట్లన్నీ నాశనమవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. భారీగా లోతుకు తవ్వడంతో చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరంగాపురం, కళేకుర్తి, నక్కలపల్లి, గుండ్లపల్లి, బెళుగుప్ప తదితర గ్రామాలకు తరలిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన శాఖ ఏఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా రంగమ్మ చెరువు నుంచి మట్టి తరలింపు తమ దృష్టికి రాలేదన్నారు. అనుమతి లేకుండా తరలించకూడదన్నారు. అలా తరలించిన, అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....