Ananthapur News: టీడీపీ నేతను పోలీసులు తీసుకెళ్లి.. 24 గంటలైంది..
ABN , Publish Date - Jan 15 , 2026 | 10:52 AM
అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.
- మా బిడ్డ ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో..?
- టీడీపీ నేత మోహన్ తల్లిదండ్రుల ఆవేదన
- ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన
అనంతపురం: తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలంటూ టీడీపీ నేత, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ తల్లిదండ్రులు.. ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. టీడీపీ నేత, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన తల్లిదండ్రులు రాజు, జయమ్మ బుధవారం సాయంత్రం ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

వారు మాట్లాడుతూ... మంగళవారం మధ్యాహ్నం ఇంటి దగ్గరకు వచ్చి మోహన్‌ను తీసుకెళ్లారనీ, 24 గంటలైనా ఎక్కడున్నాడో చెప్పకుంటే ఎలాగని మండిపడ్డారు. ఐదారుగురు పోలీసులు వచ్చి ఇంట్లో నిద్రపోతున్న తన కొడుకును తీసుకెళ్లారనీ, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, 4వ పట్టణ పోలీసు స్టేషన్లలో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్పడం లేదన్నారు. పెద్ద కుమారుడు మోహన్‌ను తీసుకెళ్లడంతో చిన్నవాడైన అఖిల్ కూడా కనిపించడం లేదన్నారు.

అఖిల్‌ను పోలీసులు తీసుకెళ్లారా... మరేదైనా జరిగిందో తెలియడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం డీఎస్పీకి లేఖ ఇచ్చామనీ, ఎస్పీ వద్దకు వస్తే అడ్డుకుంటున్నారని వాపోయారు. తమ పిల్లలకు న్యాయం చేయకుంటే... పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ సీఐ జగదీష్.. బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఎక్కడి వరకైనా వెళ్తామంటూ వారు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News