ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:55 PM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
అమరావతి/ఢిల్లీ, అక్టోబర్ 7: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందుగా హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేసు విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ సమయంలో మెరిట్స్ ఆధారంగా గానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గానీ బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణ కొనసాగుతున్నందున తదుపరి న్యాయపరమైన చర్యలను హైకోర్టు పరిధిలోనే చేపట్టాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తం 87 మంది సాక్షుల్లో చాలా మంది విచారణ ఇప్పటికే పూర్తయిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ వేగంగా కొనసాగుతోందని, తుది దశలో ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడం సముచితం కాదన్న ప్రభుత్వ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. విచారణ పూర్తయ్యే దశలో ఉన్నందున బెయిల్ అంశంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
కేసు విచారణకు మరో ఆరు నెలల గడువు ఇవ్వాలన్న అనంతబాబు సతీమణి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. రోజువారీ విచారణ కొనసాగుతున్నందున ట్రయల్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించింది. గడువులోగా విచారణ పూర్తికాకపోతే ట్రయల్ కోర్టు జడ్జి సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయవచ్చని తెలిపింది. దీంతో వీడియో ఫైళ్లు, డిజిటల్ సాక్ష్యాల ప్రామాణికతపై దాఖలు చేసిన ప్రత్యేక ఐఏను కూడా అనంతబాబు సతీమణి ఉపసంహరించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల
మోదీకి చంద్రబాబు అభినందనలు.. 25 ఏళ్ల నాయకత్వంపై ప్రశంసలు
Read Latest AP News And Telugu News