బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:54 AM
బాలిక కడుపులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకల ముద్దను అనంతపురం ప్రభు త్వ వైద్యశాల డాక్టర్లు వెలికితీశారు.
శస్త్రచికిత్స చేసి తొలగించిన అనంత వైద్యులు
‘రాపుంజల్ సిండ్రోమ్’తో బాలిక బాధపడుతున్నట్లు గుర్తింపు
అనంతపురం వైద్యం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బాలిక కడుపులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకల ముద్దను అనంతపురం ప్రభు త్వ వైద్యశాల డాక్టర్లు వెలికితీశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ఉమాశంకర్, ఉమాదేవి దంపతుల కుమార్తె లావణ్య(15) స్థానిక ప్రభు త్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే ఆమెకు తన తల వెంట్రుకలు పీక్కుతినే అలవాటు ఉం ది. ఇలా ఏళ్ల తరబడి తిన్న వెంట్రుకలు కడుపులో గడ్డకట్టి, క్రమంగా పేగుల్లోకి తోకలాగా విస్తరించాయి. కొంతకాలంగా లావణ్య తీవ్రమైన కడుపునొప్పి, అజీర్తి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను ఈ నెల 7న అనంతపురం సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె కడుపు నిండా వెంట్రుకల ముద్ద (ట్రైకోబెజోర్) గట్టిపడి ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యను ‘రాపుంజల్ సిండ్రోమ్’గా నిర్ధారించారు. మంగళవారం ‘ఎక్స్ప్లోరేటరీ లాపరోటమీ’ నిర్వహించి... అనంతరం ‘గ్యాస్ర్టోటమీ’ ప్రక్రియ ద్వారా కడుపులో పేరుకుపోయిన సమారు 750 గ్రాముల బరువు, 1.12 మీటర్ల పొడవున్న వెంట్రుకల ముద్దను ఎక్కడా తెగిపోకుండా జాగ్రత్తగా బయటకు తీశారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామస్వామి నాయక్ నేతృత్వంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉజ్జనేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అనికేత్, మహేశ్, పీజీ వైద్యులు సమీనా సుల్తానా, అఖిల్ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.
రాపుంజల్ సిండ్రోమ్ అంటే..?
మానసిక ఒత్తిడి, లేదా చిన్ననాటి అలవాట్ల కారణంగా కొందరు తమ వెంట్రుకలను పీకి మింగుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ట్రైకోఫాగియాగా పిలుస్తారు. మనిషి కడుపులోని జీర్ణరసాలు ఈ వెంట్రుకలను కరిగించలేవు. ఫలితంగా అవి కడుపులో ఒక ముద్దలా పేరుకుపోతాయి. దాని తోక భాగం క్రమంగా చిన్నపేగుల్లోకి విస్తరిస్తుంది. జర్మన్ జానపద కథలో పొడవాటి బంగారం జుట్టు ఉండే యువతి ‘రాపుంజల్’ పేరిట ఈ వ్యాధికి ‘రాపుంజల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు