లక్ష్మి చదువు ఖర్చు భరిస్తా
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:36 AM
రాప్తాడు ఘటనలో స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించి గాయపడిన విద్యార్థిని లక్ష్మి చదువు ఖర్చులను భరించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముందుకొచ్చారు.
ఆనంద్ మహీంద్ర ప్రకటన.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
అనంతపురం విద్య, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటనలో స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించి గాయపడిన విద్యార్థిని లక్ష్మి చదువు ఖర్చులను భరించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముందుకొచ్చారు. ‘‘ఆమె అసాధారణ బాలిక. ధైర్యం అంటే భయపడకపోవడం కాదు, ఇతరుల పట్ల శ్రద్ధ’’ అంటూ ఆయన లక్ష్మి సాహసాన్ని ‘ఎక్స్’ వేదికగా కొనియాడారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ఉన్మాది చొరబడి, బాధిత విద్యార్థినిపై దాడికి దిగగానే విద్యార్థులందరూ భయంతో పారిపోయారు. లక్ష్మి మాత్రమే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో లక్ష్మి కుటుంబ పరిస్థితి గురించి ‘ఆంధ్రజ్యోతి’ ఆరాతీసింది.
వారి పేదరికాన్ని కథనంతో కళ్లకు కట్టింది. దీనితోపాటు ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. లక్ష్మి సాహసం గురించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్థానిక, జాతీయ మీడియాలో మాట్లాడారు. దీంతో లక్ష్మికి అండగా అనేకమంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్ర స్పందించారు. లక్ష్మి చదువుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. ఆయనకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు