రాజధానిలో నవశక ప్రజా రవాణా!
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:50 AM
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో ఒక మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలన్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయండి
విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేలా ఉండాలి
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
సీఎం అధ్యక్షతన 66వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం
నూతన అసెంబ్లీపై ఎత్తైన స్పైర్ నిర్మాణానికి ఆమోదం
రాజధాని గ్రామాల పరిధిలో రూ.1548 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి పాలనా అనుమతి
రెండో విడత పూలింగ్‌లో ఎకరం లోపు ఉన్న రైతులకూ 40 వేల కౌలు: మంత్రి నారాయణ
అమరావతి/తుళ్లూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో ఒక మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధాని నడిబొడ్డున నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల స్పైర్ నిర్మాణానికి రూ.661 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ఆమోదం లభించింది. ఇంకా రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1548 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. నలందా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కు కృష్ణాయపాలెంలో 5 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి ఘనత చాటేలా విస్తృత ప్రచారం
అమరావతి నగరం పేరు దేశ, విదేశాల్లో మార్మోగేలా విస్తృత ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఓ బైకర్‌తో అక్కడి ఓ బాలుడు ‘అమరావతి నుంచి వచ్చారా?’ అంటూ మాట్లాడడం.. రాజధాని పేరు ప్రజల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. విద్యుత్తు స్తంభాలు లేని, బ్లూ, గ్రీన్, డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ లాంటి ఐదు అంశాలను అమరావతిని థీమ్‌గా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ పౌరుడూ ఇది నా నగరం అని భావించేలా అమరావతి పేరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాజధాని నగరాన్ని నడిపేలా భవిష్యత్ రెవెన్యూ నమూనాలపై దృష్టి సారించాలని, దీనిపై ఓ కమిటీని నియమించి అధ్యయనం చేయాలని నిర్దేశించారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు కలిపి ఓ మెగా సిటీగా అమరావతి తయారవుతుందని, ఒక సెల్ప్ ఫైనాన్సింగ్ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సీఆర్‌డీఏ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ సాయిప్రసాద్, మున్సిపల్, ఆర్థిక శాఖలు, సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు.
వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఎయిర్‌పోర్టుపై చర్చ
అమరావతి విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలు వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణానికి నేలపాడులో 0.50 ఎకరాలు కేటాయించామన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు ఎకరాకు కౌలు జరీబుకు రూ.50 వేలు, నాన్ జరీబు రూ.40 వేలు అందిస్తున్నామన్నారు. రెండో విడత భూసమీకరణలో ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ.40 వేల కౌలు ఇవ్వడానికి అథారిటీ అనుమతి లభించిందని వివరించారు. అక్టోబరు చివరి నాటికి రెవెన్యూ సమస్యలను పరిష్కరించి 80 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో దశ భూసమీకరణలో ఎవరినీ బలవంతం చేయట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి...