ఏపీలో మరో కొత్త అధ్యాయం.. రేపటి నుంచే నూతన పింఛన్ల దరఖాస్తులు
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:41 PM
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. 'ఎన్టీఆర్ భరోసా' పింఛను పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది.
అమరావతి, సెప్టెంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. సంక్షేమ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 'ఎన్టీఆర్ భరోసా' పింఛను పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది.
రూ. 4,000 పింఛన్.. కొత్త అర్హులకు గొప్ప అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కింద పెంచిన పింఛన్లను ప్రభుత్వం క్రమం తప్పకుండా అందిస్తోంది. అయితే, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు పింఛను అందుకోలేకపోయిన పేదలకు, నూతనంగా అర్హత సాధించిన వారికి కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది.
నూతన పింఛన్ల ప్రక్రియ - పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 7 – 16: నూతన పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.
సెప్టెంబర్ 17 – 21: జనరల్ వెరిఫికేషన్ (సాధారణ పరిశీలన).
సెప్టెంబర్ 22 – 24: ఫిజికల్, శాఖాపరమైన ధ్రువీకరణ, అర్హతల నిర్ణయం.
సెప్టెంబర్ 25 – 26: 'సెర్ప్' (SERP) ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ.
దరఖాస్తు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు' (గ్రామ/వార్డు సచివాలయ) కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
ప్రత్యేక ఏర్పాట్లు
దరఖాస్తుదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల వద్ద ముందస్తుగా ప్రత్యేక కౌంటర్లు, సదుపాయాలు ఏర్పాటు చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు అవసరమైన పత్రాలతో సమీప సచివాలయానికి వెళ్ళి తమ దరఖాస్తులను అందజేయాలని అధికారులు సూచించారు. అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ త్వరితగతిన నూతన పింఛన్లు మంజూరు చేయనున్నారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!