రాజధానిలో ఎఫ్‌ఎస్ఐ పీటముడి!
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:15 AM
సవరణ ప్రక్రియ రైతులకు, సీఆర్డీఏకు మధ్య పీటముడిలా మారుతోంది. ఈ అంశంపై రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేసిన కమిటీ ఎటూ తేల్చకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ సవరణపై సీఆర్డీఏ మల్లగుల్లాలు
రైతు ప్రతినిధులతో వారం రోజులుగా సంప్రదింపులు
విజయవాడ, గుంటూరుతో సమానంగా ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి
ఎఫ్‌ఎస్ఐని సవరిస్తే మాస్టర్ ప్లాన్
దెబ్బతింటుందన్న అధికారులు
వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలకు ఎక్కువెలా ఇచ్చారంటున్న రైతులు
గ్రామ సభలు నిర్వహించి, అక్కడే తేల్చాలని డిమాండ్
(గుంటూరు(రాజధాని) - ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్ఐ) సవరణ ప్రక్రియ రైతులకు, సీఆర్డీఏకు మధ్య పీటముడిలా మారుతోంది. ఈ అంశంపై రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేసిన కమిటీ ఎటూ తేల్చకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో సీఆర్డీఏ అధికారులు నేరుగా రాజధాని గ్రామాల రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా రోజుకు మూడు, నాలుగు గ్రామాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఎఫ్‌ఎస్ఐ సమస్య ఇది:
ఏదైనా నిర్మాణం చేపట్టే సయమంలో దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌కు అనుగుణంగానే నిర్మాణం జరగాలి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఇతర కారణాలు పరిశీలించి ఎఫ్‌ఎస్ఐని నిర్ణయిస్తారు. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా ఉంటుంది. ప్రస్తుతం అమరావతిలో నిర్ణయించిన ఎఫ్‌ఎస్ఐ పక్కనే ఉన్న మంగళగిరి- తాడేపల్లి, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల కంటే చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు తాడేపల్లిలో 1,600 గజాల స్థలం ఉంటే దానికి ఎఫ్‌ఎస్ఐ 51వేల చదరపు అడుగులు వస్తోంది. అంటే అక్కడ 51వేల అడుగుల్లో నిర్మాణం చేపట్టవచ్చు. అదే రాజధాని పరిధిలోని గ్రామంలో 1,600 గజాలకు 32వేల అడుగులే వస్తోంది. ఈ వ్యత్యాసం కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ గుంటూరు, విజయవాడ, మంగళగిరిల్లో 2.4 నుంచి 3.2 వరకూ ఉంది. దీన్ని తాజాగా విజయవాడ నగరంలో 6.4కు పెంచినట్లు రైతులు సీఆర్డీఏ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే అమరావతిలో ఎఫ్‌ఎస్ఐ 1.4 నుంచి 2.8 వరకూ మాత్రమే ఉంది. ఈ కారణంగా కన్‌స్ట్రక్షన్ ఏరియా భారీగా తగ్గుతోంది. ఈ లెక్కన అమరావతిలో నిర్మాణాలకు ప్రతి 1,600 గజాల స్థలానికి దాదాపు 20వేల అడుగుల కన్‌స్ట్రక్షన్ ఏరియాను నష్టపోవాల్సి వస్తోంది. దీంతో రైతుల ప్లాట్లను డెవల్‌పమెంట్ కోసం తీసుకోవడానికి బిల్డర్లు, కాంట్రాక్టర్లు వెనకాడుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫలితం లేని చర్చలు
రాజధాని రైతులతో ఈ నెల 15 నుంచి సీఆర్డీఏ చర్చలు జరుపుతోంది. 15న కృష్ణాయపాలెం, బేతపూడి, పెనుమాక, ఐనవోలు గ్రామాల రైతు ప్రతినిదులతో చర్చలు జరిపింది. 17న నవులూరు, యర్రబాలెం, మందడం, తాళ్లాయపాలెం, 19న నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, అనంతవరం, తుళ్లూరు, 21న అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచుకలపాలెం, రాయపూడి, 22న కురగల్లు, నీరుకొండ, నిడమర్రు, 23న లింగాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, 24న వెలగపూడి, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల రైతు ప్రతినిధులతో అధికారులు చర్చించారు.
ఎఫ్‌ఎస్ఐని సవరిస్తే రాజధాని మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని అధికారులు చెప్పడంపై రైతులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం నిర్మించే భవనాలు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలకు అంత భారీ నిర్మాణాలు చేసుకునేందుకు అవకాశం ఎలా వచ్చింది? వారికి ఎఫ్‌ఎస్ఐ ఎందుకు అంత ఎక్కువ ఇచ్చారు? అని రైతులు నిలదీస్తున్నారు. అయితే టీడీఆర్ బాండ్లు తీసుకుంటే ఎఫ్‌ఎస్ఐ పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్పడంపై వారు మండిపడుతున్నారు. టీడీఆర్ బాండ్లు తీసుకుంటే మాస్టర్ ప్లాన్ దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. సీఆర్డీఏ కార్యాలయానికి ఒకరిద్దరు ప్రతినిధులను పిలిచి చర్చలు జరపడం కాకుండా, గ్రామాలకు వచ్చి గ్రామ సభలు నిర్వహించి, అక్కడే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
వేల మంది రైతులకు నష్టం
రాజధానిలో 6వేల గజాల పైచిలుకు భూమి ఉంటేనే ప్రస్తుత ఎఫ్‌ఎస్ఐ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటివారికి ఎఫ్‌ఎస్ఐ 2.8గా నిర్ణయించారు. అంతకంటే తక్కువ భూమి ఉంటే ఎఫ్‌ఎస్ఐ 1.4గా ఉంది. అయితే రాజధానిలో 6వేల గజాల పైచిలుకు భూమి ఉన్నవారు కేవలం 842 మంది మాత్రమే మిగిలిన 29 వేల మంది ఐదెకరాల లోపు భూములు ఇచ్చినవారే. వీరంతా 5వేల గజాలలోపు ఉన్నవారే కావడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం