అమరావతి ఐ
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:38 AM
లండన్‌లోని ప్రసిద్ధ ’లండన్ ఐ’ తరహాలో కృష్ణానది తీరంలో ’అమరావతి ఐ’ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టును సీఆర్‌డీఏ ప్రతిపాదించగా....
‘లండన్ ఐ’ తరహాలో కృష్ణా తీరంలో నిర్మాణం
అవయవాల అక్రమ విక్రయాలకు చెక్.. ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ నిర్ణయం
శ్రీసిటీలో ఇంటర్నేషనల్ ప్రైవేట్ వర్సిటీ.. ఏపీ విమానయాన పాలసీకి ఆమోదం
ఈసారి కోటి మందితో యోగా వేడుకలు.. వెల్లడించిన మంత్రి కొలుసు
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): లండన్‌లోని ప్రసిద్ధ ’లండన్ ఐ’ తరహాలో కృష్ణానది తీరంలో ’అమరావతి ఐ’ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టును సీఆర్‌డీఏ ప్రతిపాదించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవయవదానం, అవయవ మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రం తెచ్చిన ’ద ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్-2011’ను రాష్ట్రంలో అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడినందున దీనిపై ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అవయవాల అక్రమ సేకరణ, విక్రయాలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం 1994నాటి చట్టానికి సవరణ చేసింది. అవయవాలతోపాటు కణజాలాలను కూడా దీని పరిధిలోకి తెచ్చింది. చాలా రాష్ట్రాలు ఈచట్టాన్ని ఇప్పటికే ఆమోదించగా, ఏపీ సహా 4 రాష్ట్రాలు మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అవయవ మార్పిడి కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పును దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలులోకి తెస్తూ, ఆర్టినెన్స్ జారీ చేయనున్నారు.
కృష్ణానది ఒడ్డున దాదాపు ఆరెకరాల స్థలంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ’అమరావతి ఐ’ ప్రాజెక్టును చేపడతారు. దీనికోసం ఏజీఐసీఎల్ ఎండీకి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ‘అమరావతి ఐ’(భారీ చక్రం) ద్వారా రాజధాని నగరాన్ని, నది అందాలను, చుట్టూ ఉన్న పరిసరాలను చాలా ఎత్తు నుండి స్పష్టంగా చూడవచ్చు.
రాష్ట్రంలో ఈ నెల 7నుంచి 21వరకు పక్షం రోజుల పాటు ఘనంగా యోగా దినోత్సవం-2026 వేడుకల నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం. దీనికి రూ.10కోట్లు మంజూరు చేసింది. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంతో కలుపుకొని, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి మంది ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని నిర్ణయించింది.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపే లక్ష్యంతో తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ’శ్రీసిటీ ఇంటర్నేషల్ యూనివర్సిటీ’ పేరుతో నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని (గ్రీన్‌ఫీల్డ్ కేటగిరి కింద) స్థాపించడానికి వీలుగా ‘ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్- 2016’ షెడ్యూల్‌ను సవరిస్తూ, ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. శ్రీసిటీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.250కోట్ల పెట్టుబడితో 60 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్(గ్రామీణ్-వీబీ రామ్‌జీ ఎంజీ) యాక్ట్ 2025పై గెజిట్ జారీకి ఆమోదం.
అగ్రిగోల్డ్ కేసు సహా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-1999 కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి న్యాయశాఖ ప్రతిపాదన మేరకు విజయవాడలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు 21 నూతన పోస్టుల మంజూరు.
బీచ్ షాక్స్ కోసం రూపొందించిన ఎక్సైజ్ ముసాయిదా పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం. తొలిదశలో చీరాల, విశాఖల్లో ఒక్కోచోట రెండేసి షాక్స్‌ను పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఈసీ శాఖకు సీఆర్‌డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమికి రిజిస్ర్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు, ఇతర చార్జీల నుంచి మినహాయింపు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్యాకేజ్ నంబర్ 5, 5ఏకు సవరించిన పరిపాలన మంజూరు రూ.796.66కోట్లకు ఆమోదం.
బాపట్ల జిల్లాలో కుందేరు డ్రెయిన్‌ను 11.300 నుంచి 18.950 కిలోమీటర్ల వరకు తవ్వకం పనులకు రూ.517.50 లక్షల మంజూరుకు ఆమోదం.
అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల పరిధిలో సూపర్ బ్లాక్ ’ఎఫ్’లో హైకోర్టు భవన రూఫ్‌టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం రూ.547.07కోట్లకు ఆమోదం.
రాజధానిలోని రాయపూడిలో ఆలిండియా సర్వీసెస్ అధికారుల భవనాలకు 94.90కోట్లతో హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, ఇతర సదుపాయాల పనులకు ఎల్1 బిడ్డర్‌కు అంగీకార పత్రం జారీ.
మున్సిపల్, పట్టణాభివృద్ధి (సీఆర్‌డీఏ) శాఖ గతంలో జారీ చేసిన నెగోషేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణకు ఆమోదం.
హడ్కో రీజనల్ ఆఫీస్ నుంచి 300కోట్ల స్పెషల్ టర్మ్ లోన్ తీసుకోవటానికి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం.
సీఆర్‌డీఏ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపు కొత్త ప్రతిపాదనలపైన, పాత కేటాయింపు సమీక్షపైన మంత్రుల బృందం సిఫారసులకు ఓకే.
చిత్తూరు జిల్లా చిన్న వేపంజరిలో వ్యవసాయశాఖకు చెందిన 46.69 ఎకరాల భూమి ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి 30ఏళ్ల లీజుకు ఇవ్వడానికి అంగీకారం.
చిత్తూరు జిల్లా సాతు గ్రామంలోని 4.94 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరానికి రూ.12.38లక్షల చొప్పున ఏపీఐఐసీకి కేటాయింపు.
విశాఖ రూరల్ మధురవాడలో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీటీడీసీకి బదలాయింపు.
చిత్తూరు జిల్లా గుడుపల్లెలోని 12.75 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరానికి రూ.12లక్షల చొప్పున ఏపీఐఐసీకి కేటాయింపు.
నెల్లూరు జిల్లా సీతారామపురం, పెదనాగంపల్లిలో 5.71 హెక్టార్ల ప్రభుత్వ భూమి అటవీశాఖకు బదిలీ. చిత్తూరుజిల్లా తోటకనుమలో 11.96ఎకరాల ప్రభుత్వ భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఎకరా రూ.8లక్షల చొప్పున కేటాయింపు.
అనకాపల్లి జిల్లా తుమ్మపాల, కొత్తూరులో రెండెకరాలు, కాకినాడలో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ ఆఫీ్‌సల నిర్మాణానికి ఎకరం రూ.వెయ్యి చొప్పున 66 ఏళ్లకు లీజుకు కేటాయింపు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 25.37 ఎకరాల భూమిని చెరువు పోరంబోకు నుంచి గ్రామ కంఠంగా మార్చడానికి ఆమోదం.
కృష్ణాజిల్లా కారగ్రహారంలో 0.58ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ మారిటైమ్ బోర్డుకు ఎకరా రూ.42.27లక్షలకు అప్పగింత.
బందరులో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కోసం ఏడాదికి రూ.1.25లక్షల చొప్పున 33ఏళ్ల పాటు లీజుకు ఆమోదం.
కడప జిల్లా పలుగురాళ్లపల్లిలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకొరెనర్ ఎనర్జీ ఇండియా సంస్థకు లీజు పద్ధతిలో కేటాయింపు.
కృష్ణా జిల్లా చల్లపల్లిలో 11.80 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
కడప జిల్లా మల్లెల, బుచ్చుపల్లిలో 207.31, 70.04 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి లీజు పద్ధతిలో కేటాయింపు.
అనంతపురం జిల్లా దోనిముక్కల, తిమ్మాపురం గ్రామాల్లో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని పవర్‌గ్రిడ్ ట్రాన్స్‌మిషన్‌కు కేటాయింపు.

ప్రధాన విమానయాన కేంద్రంగా అమరావతి
ఏవియేషన్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం
రాష్ట్రంలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీ నజరానాలతో కూడిన ప్రోత్సాహకాలను అందజేస్తూ విమానయాన పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని విమానాశ్రయాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం .. అమరావతిని ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. ఇవీ ప్రోత్సాహకాలు : రాష్ట్రంలో విమానాలను నడిపే సంస్థలకు తొలి మూడు సంవత్సరాల్లో పార్కింగ్ అండ్ ల్యాండింగ్ చార్జీలు తిరిగి చెల్లిస్తారు. కొత్త దేశీయ రూట్లకు అవసరమైన ఆర్థిక లోటు భర్తీ చేస్తారు. స్థిర మూలధన పెట్టుబడిపై 20 శాతం రాయితీని ఇస్తారు. సామర్థ్యాభివృద్ధి, ఉపాధి లక్ష్యాల సాధనకు అదనంగా పదిశాతం ఎఫ్‌సీఐ సబ్సిడీ లభిస్తుంది. యాంకర్ ఎంఆర్‌ఓ కోసం అదనంగా మూడు శాతం ఎఫ్‌సీఐ లభిస్తుంది. ప్రాజెక్టు వ్యయానికి గరిష్ఠంగా 20 శాతం మేర వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లభిస్తుంది. విమానాశ్రయాలు, వాటర్ డ్రోమ్‌ల కోసం రెవెన్యూ షేర్, లీజులు, లైసెన్సు ఫీజుల్లో అవసరాన్ని బట్టి సడలింపులు ఉంటాయి. కన్సెషన్ ఒప్పందంలో భాగంగా అ న్ని ప్రాజెక్టు ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు దక్కుతుంది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన విమానయాన కోర్సులు చేసినవారికి శిక్షణ వ్యయంలో 50 శాతం లేదా రూ.పదివేలు తిరిగి చెల్లిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రతిభావంతులైన మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తారు. పాలసీకి సంబంధించి ఈ వివరాలను మంత్రి బీసీ జనార్దనరెడ్డి క్యాబినెట్‌కు తెలిపారు.