Share News

వాణిజ్య సంస్థలు కూల్‌.. కూల్‌!

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:41 AM

గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిని అత్యాధునిక సదుపాయాలకు నిలయంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ కృషి చేస్తోంది. అందులో భాగంగా రాజధాని నగరానికి గుండెకాయలాంటి కోర్‌ క్యాపిటల్‌లో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్లకు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ (డీసీఎస్‌) ద్వారా ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంది.

వాణిజ్య సంస్థలు కూల్‌.. కూల్‌!

  • డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు సీఆర్డీఏ ఏర్పాట్లు

  • 30 వేల టీఆర్‌ సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటు

  • క్వాంటం వ్యాలీ టవర్స్‌ సహా పలు సంస్థలకు ఏసీ

  • తాజాగా టెండర్లు ఆహ్వానించిన సీఆర్డీఏ

గుంటూరు (రాజధాని), అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిని అత్యాధునిక సదుపాయాలకు నిలయంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ కృషి చేస్తోంది. అందులో భాగంగా రాజధాని నగరానికి గుండెకాయలాంటి కోర్‌ క్యాపిటల్‌లో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్లకు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ (డీసీఎస్‌) ద్వారా ఏసీ సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంది. తాజాగా అమరావతిలో నిర్మించే వాణిజ్య సముదాయాలకు కూడా ఆ సదుపాయాలను విస్తరించేందుకు చర్యలు ప్రారంభించింది.

అమరావతిలోని కీలక రహదారి అయిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంట వచ్చే వ్యాపార సంస్థల పారిశ్రామిక అవసరాల కోసం 12,000 టీఆర్‌(టన్నేజ్‌ ఆఫ్‌ రెఫ్రిజిరేషన్‌) ప్రారంభ సామర్థ్యంతో స్టేజ్‌-1 ప్రాజెక్టు కూలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. అత్యంత ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ టవర్స్‌ సహా ఇతర వ్యాపార సంస్థలకు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ విధానంలో చల్లదనాన్ని సరఫరా చేయనుంది. భవిష్యత్తు అవసరాల రీత్యా కూలింగ్‌ సామర్థ్యం 30,000 టీఆర్‌ ఉండేలా ప్లాంటును అభివృద్ధి చేసేందుకు వీలుగా నిబంధనలు రూపొందించింది. పీపీపీ పద్ధతిలో ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ ప్లాంట్‌, డిస్ర్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌(రింగ్‌ మెయిన్‌) ఇంటర్‌ఫేస్‌ నెట్‌వర్క్‌తో దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


కూలింగ్‌ నెట్‌వర్క్‌ ఇలా..

డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌(డీసీఎస్‌) అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న అనేక భవనాలకు ఒక కేంద్రం నుంచి చల్లని గాలి (ఎయిర్‌ కండిషనింగ్‌) అందించే ఒక సమర్థవంతమైన సాంకేతికత. వ్యక్తిగత భవనాల్లో విడివిడిగా ఏసీలు లేదా చిల్లర్లు ఏర్పాటు చేసుకోకుండా.. ఒకే కేంద్రీకృత (సెంట్రలైజ్‌డ్‌) ప్లాంట్‌ ద్వారా మొత్తం కాలనీ, క్యాంపస్‌ లేదా నగరంలోని వాణిజ్య సముదాయాలకు చల్లదనాన్ని పంపిణీ చేస్తారు. తద్వారా నాణ్యమైన గాలి అందుబాటులోకి రావడంతోపాటు విద్యుత్‌ ఆదా అవుతుంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావం తగ్గుతుంది. ఈ విధానం ద్వారా ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉండడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఈ విధానంలో.. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంట ఉన్న క్వాంటం వ్యాలీ భవన సముదాయం, వ్యాపార సంస్థలు, నివాస, వాణిజ్య భవనాలు, సంస్థలు పరిశ్రమల పారిశ్రామిక అవసరాల కోసం ఇన్సులేటెడ్‌ పైపుల ద్వారా కొంత దూరం వరకు చిల్డ్‌ వాటర్‌ (చల్లని నీరు)ను పంపిణీ చేస్తారు. త్వరలో నిర్మాణం కాబోతున్న క్వాంటం టవర్‌ 1(టీ1), క్వాంటమ్‌ టవర్‌ 2(టీ2), బిట్స్‌ అమరావతి క్యాంపస్‌, బ్యాంకు సిటీలో నిర్మిస్తున్న బ్యాంకులు, హోటళ్లు, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పైపులైన్ల ద్వారా చల్లని గాలి అందజేస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:41 AM