Share News

అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత.. మూడు రాజధానులపై

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:06 AM

రాజధాని అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో 3 రాజధానుల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని హైకోర్టు పేర్కొంది.

అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత.. మూడు రాజధానులపై

  • హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు

  • గత ప్రభుత్వ అప్పీళ్లపై సుప్రీంలో 29న విచారణ

  • దీంతో వ్యాజ్యాలపై విచారణ వాయిదా

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో 3 రాజధానుల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని హైకోర్టు పేర్కొంది. అమరావతే ఏకైక రాజధాని అంటూ 2022 మార్చి 3న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీళ్లు ఈ నెల 29న సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పిటిషన్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ బీఎస్‌.భానుమతితో కూడిన త్రిసభ్య ధర్మానం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణ(3 రాజధానుల) చట్టాలను సవాల్‌ చేస్తూ అమరావతి రైతులతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం అమరావతే ఏకైక రాజధాని అంటూ 2022 మార్చి 3న తీర్పు ఇచ్చింది. అమరావతి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు నిరంతర మాండమస్‌ జారీచేసింది. ల్యాండ్‌ పూ లింగ్‌ స్కీమ్‌లో భాగంగా రైతులతో చేసుకు న్న ఒప్పందం అమలు, వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగింత, రాజధాని నగర నిర్మాణం, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గడువులు విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో అప్పీళ్లు వేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి హైకోర్టు నిర్దేశించిన గడువులపై స్టే విధించిన విషయం తెలిసిందే.


ఉపసంహరించుకుంటే చాలు..

శుక్రవారం హైకోర్టు ముందున్న వ్యాజ్యా లు విచారణకు వచ్చాయి. కొంత మంది పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద భూములిచ్చిన రైతుల కు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. నిర్దిష్ట గడువులోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని పేర్కొంటూ అఫిడవిట్‌ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. హైకోర్టు నిర్దేశించిన గడువులను సుప్రీంకోర్టు స్టే చేసిందని గుర్తుచేసింది. సర్వోన్నత న్యాయస్థానం వద్ద అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కాలపరిమితులు విధిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో నిర్దేశించిన గడువులను మాత్రమే సుప్రీంకోర్టు స్టే చేసిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పగించే విషయంలో స్టే విధించలేదన్నారు. మరికొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాది డీఎస్ ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. గత వైసీపీ ప్రభుత్వం వేసిన అప్పీళ్లను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంటే సరిపోతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. వివరాలతో మెమో దాఖలు చేశామని సీనియర్‌ న్యాయవాది కేఎ్‌సమూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వేగంగా రాజధాని పనులు: ఏజీ

అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పను లు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మూడేళ్ల వ్యవధిలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని 2024 డిసెంబర్‌ 10న సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేశామని, వివరాలు నమోదు చేస్తూ ఎస్‌ఎల్‌పీలను డిస్పోజ్‌ చేయాలని కోరామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. అప్పీళ్లు సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు రావచ్చని ప్రశ్నించింది. సీనియర్‌ న్యాయవాదులు, ఏజీ శ్రీనివాస్‌ బదులిస్తూ... సుప్రీంకోర్టు రిజిస్ట్రీ టెన్‌టెటీవ్‌ లిస్ట్‌లో అప్పీళ్లు ఈనెల 29 విచారణకు రానున్నట్లు ఉందన్నారు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:06 AM