పార్టీ.. పర్సనల్.. ప్రభుత్వం
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:09 AM
పార్టీ, పర్సనల్, ప్రభుత్వం....అనే మూడు ‘పీ’లను అంతా పాటించాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కోరారు. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలని తెలిపారు. టీడీపీ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ మాట్లాడారు.
మూడు ‘పీ’లను అంతా పాటించాలి
కలిసికట్టుగా రాష్ర్టాన్నీ, పార్టీనీ నడిపిద్దాం
వైసీపీ అబద్ధాలు చెప్పినంత ఈజీగా మనం నిజాలను చెప్పలేకపోతున్నాం: లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పార్టీ, పర్సనల్, ప్రభుత్వం....అనే మూడు ‘పీ’లను అంతా పాటించాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కోరారు. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలని తెలిపారు. టీడీపీ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ మాట్లాడారు. ‘‘మనందరం నాయకులుగా ఇక్కడ కూర్చున్నామంటే, అందుకు కార్యకర్తల పోరాటాలు, త్యాగమే కారణం. ఇది రొటీన్ కాంక్లేవ్ కాదు. నాయకులకు శిక్షణ ఇచ్చేందుకే దీనిని పెట్టాం. కార్యకర్తలకు, ప్రజలకు నాయకులు ఎలా దగ్గర కావాలి, పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే అంశాలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకోసారి కాంక్లేవ్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. 2019లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంగళగిరిలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయానని, కానీ 2024లో 91వేల మెజార్టీతో గెలుపొందానని తెలిపారు. ‘‘నాయకులకు వారి బలహీనతలేంటో చెప్పగలగాలి. అప్పుడే అపజయాలు విజయాలుగా మారుతాయి. నాయకులు పుట్టరు. తయారవుతారు. నేను నాయకుడిగా ఎదిగానంటే ఆ క్రెడిట్ చంద్రబాబుది కాదు.. సైకోది’’ అని వ్యాఖ్యానించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు వంటి నాయకులను పార్టీలో ఆదర్శంగా తీసుకోవాలని, వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అని వివరించారు. లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
నిరాడంబర నేతలను ప్రజలు మెచ్చుతారు..
‘‘నాయకులు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. బాధ్యతగా ఉండాలి. నాయకులుగా మనం ముందు వినగలగాలి. దీనిని నేను ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నాను. ప్రధానిగా ఉండి కూడా ఆయన నా నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. నిరాడంబరతను ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు అందరినీ కలవాలి. మనమే వంద మందిని వెంటేసుకుని వెళ్లకూడదు. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. నీతులు చెప్పడమే కాదు.. పాటించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన సైన్యం సరిగా ఉంటేనే యుద్థంలో గెలుస్తాం. ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన వారిని గుర్తించాలి. నియోజకవర్గంలో చిన్న సమస్య నైనా సీరియస్‌గా తీసుకోవాలి. నేతలు పోస్ట్ ఆఫీస్‌లా మారకూడదు. లీడర్‌లా వ్యవహరించాలి. నియోజకవర్గాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలకు వెళ్లి తనిఖీ చేయాలి. చేసిన పనులు చెప్పుకోవాలి. డీఆర్సీ సమావేశాన్ని సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం’ అని స్పష్టం చేశారు.
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్
‘‘డీఎస్సీ విషయంలో మనం ఏ తప్పూ చేయలేదు. జగన్ ఏనాడూ బాబాయి హత్య, ఏపీపీఎస్సీ, దస్తగిరి, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడలేదు. డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. మనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే డీఎస్సీపై అందరం మాట్లాడుతున్నాం. 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఇచ్చింది సున్నా. ఐదేళ్లలో మనం 30వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. గూగుల్ కోసం తెలంగాణ, మహారాష్ట్రలు పోటీపడుతున్నాయి. అదే గూగుల్ మన వైజాగ్‌కు వస్తే దుష్ప్రచారం చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలి. వైసీపీ అబద్ధాలు చెప్పినంత ఈజీగా మనం నిజాలు చెప్పలేకపోతున్నాం. కాకినాడలో పోలీస్ రిక్రూట్‌మెంట్ గురించి ఆందోళన జరిగింది. వైసీపీ హయాంలో ఇచ్చింది సున్నా. మనం 6వేల కానస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఈ ఏడాది 3వేలు భర్తీ చేస్తున్నాం. ఈ ఐదేళ్లలో 10వేల పోస్టులు భర్తీ చేస్తాం. అయినా మనల్ని చాలెంజ్ చేస్తున్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలి. పార్టీ కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోవాలి.’’
సోషల్ మీడియాను తేలిగ్గా తీసుకోవద్దు
‘‘సోషల్ మీడియాను సమర్ధంగా వినియోగించుకోవాలి. ఆ మాధ్యమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి . ప్రభుత్వం చేస్తున్న అభివృద్థి పనులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తపైనా ఉంది. సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై దుష్ప్రచారంపై సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేశాను. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ప్రతిపక్షం పని ఎప్పుడూ బురద జల్లడమే. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా బృందాలు ఎప్పటికప్పుడు స్పందించాలి.’’ అని లోకేశ్ కోరారు.
ఈ వార్తలనూ చదవండి...