రైవాడ ఖాళీ!
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:35 AM
మండలంలోని రైవాడ జలాశయం నీటి నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. ఎలినోనా వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పరివాహక ప్రాంతాల నుంచి కనీసస్థాయిలో కూడా వరద నీరు రాకపోవడం, మరోవైపు కాలువల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతున్నది.
కనిష్ఠస్థాయికి చేరువలో జలాశయం నీటిమట్టం
గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు.. ప్రస్తుతం 103.8 మీటర్లు
ఎగువ నుంచి జీరో ఇన్‌ఫ్లో
కాలువలకు 200 క్యూసెక్కులు విడుదల
ప్రస్తుతం ఉన్న నీరు 25 రోజులకే వస్తుందంటున్న అదికారులు
దేవరాపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడ జలాశయం నీటి నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. ఎలినోనా వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పరివాహక ప్రాంతాల నుంచి కనీసస్థాయిలో కూడా వరద నీరు రాకపోవడం, మరోవైపు కాలువల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా మట్టిదిబ్బలు బయటపడుతున్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా మంగళవారం సాయంత్రం 103.8 మీటర్లు మాత్రమే వుంది. డెడ్ స్టోరేజీకి 3.8 మీటర్ల దూరంలో వుంది. గత ఏడాది ఇదే రోజున (సెప్టెంబరు 8) నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరువలో 113.5 మీటర్లు వుంది. అప్పట్లో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు స్పిల్‌వే గేట్లను ఎత్తి వరద నీటిని నదిలోకి విడిచిపెట్టారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది. ఈ ఏడాది ఖరీఫ్‌కు జూలై 23న ఎడమ కాలువ నుంచి వంద క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదలను ప్రారంభించారు. ఇదే సమయంలో విశాఖ నగర తాగునీటి అవసరాల కోసం 50 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలల నుంచి రిజర్వాయర్‌లోకి కనీసస్థాయిలో కూడా ఇన్‌ఫ్లో లేదు. రైవాడ జలాశయం పరివాహక ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, హుకుంపేట మండలాల్లో వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణమని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. సుమారు 45 రోజుల నుంచి కాలువల ద్వారా పొలాలకు నీటిని విడుదల చేస్తుండడం, మరోవైపు వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. కాలువలకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తే.. రిజర్వాయర్‌లో ప్రస్తుతం వున్న నీరు 25 రోజులకు సరిపోతుందని, ఈలోగా వర్షాలు సమృద్ధిగా కురవకపోతే వరి పొలాలకు ఇబ్బందేనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998 తరువాత సెప్టెంబరు మొదటి వారంలో రైవాడ జలాశయంలో ఇంత తక్కువ నీరు వుండడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.
ఇదిలావుండగా రైవాడ ఆయకట్టు భూముల్లో ఇంకా వరినాట్లు పూర్తికాలేదు. వర్షాలు పడకపోవడంతో పొలాలను దమ్ము చేయడానికి ఎక్కువ నీరు అవసరం అవుతున్నది. నాట్లు వేసిన పొలాలకు కూడా అధిక నీరు పెట్టాల్సి వస్తున్నది. చెదురుముదురుగా వర్షాలు కురుస్తుంటే.. వారానికి ఒకసారి కాలువ నీరు పెడితే సరిపోతుంది. కానీ వరుణుడు మొహం చాటేయడంతో రెండు, మూడు రోజులకోసారి నీరు పెట్టాల్సి వస్తున్నది. దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరు సరిగా అందని పరిస్థితి నెలకొంది.