Share News

ఎల్‌నినో ఎఫెక్ట్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:34 AM

ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలకు మరింతగా కాస్తో, కూస్తో చేతికందుతున్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో 3.80 లక్షల హెక్టార్లలో సాగు చేసిన పత్తి, వేరుశనగ, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి

ఎల్‌నినో ఎఫెక్ట్‌
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)

పనుల్లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు

కర్నూలు జిల్లాలో 23వేల మంది, నంద్యాల జిల్లాలో 25వేల మంది ఉపాధి బాట

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలకు మరింతగా కాస్తో, కూస్తో చేతికందుతున్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో 3.80 లక్షల హెక్టార్లలో సాగు చేసిన పత్తి, వేరుశనగ, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. నంద్యాల జిల్లాలో కేవలం 1.90లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఈ సీజన్‌లో నంద్యాల జిల్లాలో కాలువల కింద సాగు చేసిన పంటలు పచ్చదనంతో నిండి కనుచూపు మేర కళకళలాడుతుండేవి. ఈసారి రెండు జిల్లాలో సాగు చేసిన పంటలు ఎక్కడా చూసినా ఎండుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో రెండు జిల్లాలో కరువు పనులు ఈ సీజన్‌లో గత సంవత్సరం వరకు కూలీలు ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తిగా మందగించడంతో ఉపాధి పనుల కోసం ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో 43వేల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అదే విదంగా నంద్యాల జిల్లాలో 45 వేల మందికి పనులు కల్పించాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే. ఇప్పటిదాకా పని చేసిన పనులకు సంబంధించి వేతనాలు అందలేదు. కర్నూలు జిల్లాలో 11.40 కోట్లు, నంద్యాల జిల్లాలో 20 కోట్లు గత నెలన్నర రోజులుగా ఉపాధి పనులు చేస్తున్న వారికి అందించకపోవడంతో పస్తులతో కాపురం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసింహారెడ్డి తెలిపారు.

Updated Date - Sep 08 , 2026 | 12:34 AM