Share News

అక్షర ఆంధ్రతో సత్ఫలితాలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:11 AM

రాష్ట్రంలో గత ఏడాది నుంచి చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్యలపై మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

అక్షర ఆంధ్రతో సత్ఫలితాలు

  • వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి

  • అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలి

  • 5న 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

  • మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడవద్దు

  • లీప్‌ యాప్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలి

  • విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఏడాది నుంచి చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్యలపై మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత దేశంలోనే అట్టడుగున కేవలం 72.6 శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారు. ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఏపీ కృషిని కేంద్రం అభినందించినట్లు అధికారులు చెప్పడంతో మంత్రి లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన వయోజన విద్య పరీక్ష ఫలితాల్లో అక్షరాస్యత 10 శాతం పెరిగి 82.1 శాతానికి చేరుకుందని, 2027 సెప్టెంబరు నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధన దిశగా పని చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 2027 మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబరు నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్‌లో సుమారు 10 వేల అడ్మిషన్లు పెరిగాయని ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ ఏడాది తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే రూ. 1,051 కోట్ల మేర ఆర్థిక సాయం అందించగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు త్వరలో ఇస్తామని చెప్పారు.


బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి..

పాఠశాల విద్యపై మంత్రి లోకేశ్‌ సమీక్షిస్తూ.. బడి ఈడు పిల్లలందరినీ ట్రాక్‌ చేసి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడి బయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తిస్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్‌ అటెండెన్స్‌ గణనీయంగా పెరిగి ప్రస్తుతం 98.97 శాతంగా ఉన్నట్లు పాఠశాల విద్య డైరెక్టరు తమీమ్‌ అన్సారియా చెప్పారు. ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిషన్‌ మార్చి-2026పైనా మంత్రి సమీక్షించారు. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు నిర్వహించాల్సిన స్పెషల్‌ టెట్‌ నిర్వహణపై కూడా చర్చించారు. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ చెప్పారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లీప్‌ యాప్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ అందజేయాలని మంత్రి కోరారు. 125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టరు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:11 AM