40 కోట్ల డీల్ నిజం!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:02 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు.
నాకు 5 కోట్లు ఇస్తామన్నారు
వివేకా కేసులో ఈడీకి వివరించిన దస్తగిరి
ఏడున్నర గంటలు విచారించిన అధికారులు
మనీట్రయల్ కోణంలో దర్యాప్తు
ఆర్థిక లావాదేవీలపై సుదీర్ఘ విచారణ
హైదరాబాద్/కడప, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. దాదాపు ఏడున్నర గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరిందన్న విషయాన్ని దర్యాప్తు అధికారులకు దస్తగిరి పూసగుచ్చినట్లు వివరించాడని తెలుస్తోంది. దస్తగిరి తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డి ఇతర నిందితులను
ఈడీ అధికారులు విచారించనున్నారని సమాచారం. వివేకా హత్య వెనుక ఉన్న ఆర్థిక మూలాలను, మనీలాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో పాటు మరికొందరి మధ్య రూ.40 కోట్ల డీల్ జరిగినట్లు ఇప్పటికే సీబీఐ గుర్తించింది. సీబీఐ నివేదిక ఆధారంగా ఈ కేసులో మనీలాండరింగ్ గుట్టును ఛేదించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గత నెలలో ఈడీ అధికారులు ఏకకాలంలో పులివెందుల, హైదరాబాద్‌లోని ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇళ్లతో పాటు పులివెందులలోని దస్తగిరి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, తొండూరు మండలంలోని ఎర్రగంగిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అవినాశ్‌రెడ్డి ఇంట్లో రూ.24 లక్షల నగదు, రెండు లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. అదే సమయంలో దస్తగిరి ఇంటి నుంచి పెద్దఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వాటి గురించి అధికారులు ఆరా తీయగా.. ఆ పత్రాలు తనవి కాదని, తాను మధ్యవర్తిగా కొంతమంది సెటిల్‌మెంట్లకు వచ్చిన పత్రాలని దస్తగిరి తెలిపాడు.
వివేకా హత్యకు ముందు, తర్వాత దస్తగిరి, అతడి భార్య బ్యాంకు అకౌంట్లను అందించారు. వివేకాను హత్య చేస్తే తనకు రూ.5 కోట్లు ఇస్తారని చెప్పిన విషయాన్ని ఈడీ అధికారులకు దస్తగిరి వివరించినట్టు తెలుస్తోంది. ఆ 5 కోట్ల నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది? అనే విషయాన్ని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ తర్వాత దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాను విచారణకు వస్తానని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, తన ఇంట్లో దొరికిన భూముల పత్రాలు ఈ కేసుకు సంబంధించినవి కావని తెలిపాడు.