Share News

ఉపాధ్యాయ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించండి

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:17 AM

ఉమ్మడి కృష్టా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులను(డీఈవో) రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు ఆదేశించారు.

 ఉపాధ్యాయ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించండి

  • ఎన్నికల అధికారులకు రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశం

  • 6న ముగియనున్న ఓటు నమోదు దరఖాస్తు స్వీకరణ గడువు

  • 25న ముసాయిదా ఓటర్ల జాబితా, డిసెంబరు 30న తుది జాబితా

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్టా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులను(డీఈవో) రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు ఆదేశించారు. అర్హులైన ఉపాధ్యాయ ఓటర్లలో ఒక్కరు కూడా ఓటరు జాబితాలో చోటు కోల్పోకుండా అందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాతో పోలిస్తే ఇప్పటివరకు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడంలేదలేదని తెలిపారు. 2021 ఓటర్ల జాబితాలోని ఓటర్ల కన్నా ఇప్పుడు ఓటరు నమోదు దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉందని వెంటనే ఆయా జిల్లాల డీఈవోలు ఉపాధ్యాయ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఓటుకు అర్హులైన ఉపాధ్యాయుల సంఖ్య, ఇంకా నమోదు కావాల్సిన వారి వివరాలను నిర్దేశిత నమూనాలో ఎన్నికల అధికారులు స్వీకరించాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు పరిస్థితిని జిల్లా ఎన్నికల అధికారులు స్వయంగా సమీక్షించాలని నిర్దేశించారు.ఈ నెల 6వ తేదీతో ఓటర్ల నమోదు దరఖాస్తు స్వీకరణ గడువు ముగుస్తుందని, ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్టు ఢిల్లీరావు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈ నెల 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తామన్నారు. డిసెంబరు 25 లోగా అభ్యంతరాలు పరిష్కరించి, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:17 AM