నాపై ఆరోపణలు నిరాధారం: నటి జత్వానీ
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:39 PM
తనపై సీఐడీ ఛార్జ్‌షీట్‌లో నమోదైన ఆరోపణలను ముంబై సినీ నటి జత్వానీ తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వీడియో ద్వారా ఆమె ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: తనపై ఆరోపణలు నిరాధారమని.. తప్పుడు కేసు పెట్టారని ముంబై సినీ నటి జత్వానీ తీవ్రంగా ఖండించారు. తనతో పాటూ తన కుటుంబ సభ్యులపై 2024లో ఏపీలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసును కుట్రపూర్వకంగా నమోదు చేశారని, దర్యాప్తులో తన వాంగ్మూలం, తన వాదనను పూర్తిగా పక్కనపెట్టారని పేర్కొన్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాల పోరాటం తర్వాత తన కుటుంబ సభ్యులు నిర్దోషులుగా తేలినా, తాజాగా దాఖలైన 20 పేజీల సీఐడీ ఛార్జ్‌షీట్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని వీడియోలో వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్ తన ఖాతాలో జమ చేసిన సుమారు రూ.4.5 లక్షలు తాను చేసిన పనికి ఇచ్చిన పారితోషికమేనని, స్వచ్ఛందంగా ఇచ్చిన ఆ మొత్తాన్ని నేరానికి ఆధారంగా చూపడం సరైందికాదని జత్వానీ అన్నారు.
ఈ సందర్భంగా జత్వానీ మాట్లాడుతూ.. ‘ఇంకా రావాల్సిన డబ్బు అడిగిన విషయాన్ని కూడా తప్పుగా చిత్రీకరించారు. కుక్కల విద్యాసాగర్ బ్యాగ్ గ్రౌండ్ మంచిది కాదని తెలిసి అతన్ని తిరస్కరించా. కానీ, అతడు నగ్న సెల్ఫీలు పంపి వేధించాడు. అదే ఫొటోను ఇప్పుడు సీఐడీ ‘అభ్యంతరకర ఫొటో’గా చూపించడం విచారం. ఫిర్యాదుదారుడితో నా పరిచయం, ఆర్థిక లావాదేవీలు దాదాపు పదేళ్ల క్రితమే ముగిశాయి. రూ.4.5 లక్షల లావాదేవీని రూ.1.32 కోట్లుగా చూపడం, బ్లాక్‌మెయిల్, ఎక్స్‌టార్షన్, ర్యాకెట్ వంటి ఆరోపణలు పూర్తిగా అసత్యం. ఇదే అంశాలపై గతంలో న్యాయస్థానంలో విచారణ జరిగింది. 2025లో విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు నమోదయ్యాయి. 2025లో విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు నమోదయ్యాయి. ఇప్పటికైనా నిష్పాక్షిక దర్యాప్తుతో నిజం వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తండ్రిని కాపాడిన తనయుడు! వరద నీటిలో 3 గంటల పాటు ఈది..