‘22(ఏ)’కు 2 నెలల్లో పరిష్కారం
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:27 AM
నిషేధిత జాబితా 22(ఏ)లోని పట్టా భూములకు త్వరలో విముక్తి కలగనుంది. పట్టా భూముల్ని ఇకపై 22(ఏ)లో ఉంచడానికి వీల్లేదని సర్కారు స్పష్టం చేసిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది.
పట్టాభూములకు నిషేధ విముక్తి
అక్టోబరు నాటికి పూర్తి చేయాలని
ఆర్డీఓలకు రె వెన్యూ శాఖ టార్గెట్
కలెక్టర్ల లాగిన్ నుంచి ఫైళ్లు బదిలీ
ఆర్డీవోల పరిశీలనకు 32 వేలకుపైగా
(అమరావతి-ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా 22(ఏ)లోని పట్టా భూములకు త్వరలో విముక్తి కలగనుంది. పట్టా భూముల్ని ఇకపై 22(ఏ)లో ఉంచడానికి వీల్లేదని సర్కారు స్పష్టం చేసిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. అక్టోబరు నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పట్టా భూములకు విముక్తి కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతను కలెక్టర్ నుంచి తప్పించి సబ్‌కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)కి అప్పగించారు. దీంతో జిల్లాల కలెక్టర్ల వద్ద ఉన్న పట్టా భూములకు సంబంధించిన నిషేధ విముక్తి ఫైళ్లు, ప్రజల నుంచి వచ్చిన పలు విన్నపాలను కలెక్టర్ల లాగిన్ నుంచి ఆర్డీఓలకు బదిలీ చేశారు. దాదాపు 32 వేలకు పైగా ఫైళ్లు ఆర్డీఓల పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగత కక్షలతో కూడా నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టించిన ఉదంతాలు వెలుగుచూశాయి. అన్యాయంగా జాబితాలో చేర్చి క్రయవిక్రయాలను అడ్డుకున్నారు.
కూటమి సర్కారు వచ్చిన తొలి రోజుల్లో నిర్వహించిన గ్రామసభల్లో రైతుల నుంచి 82 వేలపైనే పిటిషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టా భూములను 22ఏలో ఎందుకు చేర్చారు? ఏ కేటగిరీ కింద చేర్చారన్న అంశాలపై సర్కారు ఆరాతీసింది. వేలాది మంది రైతుల పట్టా భూములను 22 (ఏ)లో చేర్చారని నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఇలాంటి పట్టా భూములకు నిషేధ విముక్తి కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అనేక ఆదేశాలు జారీ చేసింది. కానీ చాలామంది కలెక్టర్లు ఈ ఆదేశాలు పాటించలేదు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. తమ ఆన్‌లైన్ ఈ-ఆఫీస్ లాగిన్‌లో ఉన్న ఫైలుపై నిర్ణయం తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా కొందరు కలెక్టర్లు శ్రద్దపెట్టలేదు. కొందరయితే ఉద్దేశపూర్వకంగానే 22(ఏ) ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిణామాలపై రైతులకు 22(ఏ) సమస్య, పరిష్కారంలో కలెక్టర్ల అలసత్వంపై ‘ఆంధ్రజ్యోతి’ గత రెండేళ్లుగా అనేక వార్తలను ప్రచురించింది. పట్టా భూములకు నిషేధ విముక్తి కల్పించడంలో కలెక్టర్లే ప్రధాన అడ్డంకిగా మారిపోయారని, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదని వరస కథనాలు ప్రచురించింది. ఈ పరిణామాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తీవ్రంగా పరిగణించారు. పట్టా భూములే గాక కీలక భూముల నిషేధ విముక్తి బాధ్యతలను కలెక్టర్ నుంచి తప్పిస్తూ సబ్‌కలెక్టర్, ఆర్డీఓలకు అప్పగిస్తూ జూలై 22న ఉత్తర్వులు(జీఓ 444) జారీ చేశారు. ఈ ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కూడా కొందరు కలెక్టర్లు తమ వద్ద ఉన్న 22(ఏ)ఫైళ్లను వదులుకోలేదు. మరోసారి సీఎస్, సీసీఎల్‌ఏలు సమీక్ష చేసి కలెక్టర్ల వద్ద ఉన్న ఫైళ్లు ఆర్డీఓలకు అప్పగించాలని స్పష్టం చేశారు.
ఆ తర్వాతే వేలసంఖ్యలో పైళ్లు ఆర్డీఓలకు చేరాయి. వీటిని క్రోడీకరిస్తే దాదాపు 10 ఏళ్లుగా కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్ ఫైళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో నాలుగు నుంచి పదేళ్ల వరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు అత్యధికంగా ఉన్నట్లు వెలుగుచూసింది. అంటే.. ఎన్ని ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చినా ఆయా జిల్లాల్లో అధికారులు లక్ష్యపెట్టలేదని ఫైళ్ల పెండింగ్ చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదని భావించిన సీఎస్ సాయిప్రసాద్ 22(ఏ) కేసుల పరిష్కారానికి గడువు విధించారు. అక్టోబరు నెలాఖరు నాటికి ఆర్డీఓల లాగిన్‌లో ఉన్న 22(ఏ) కేసుల ఫైళ్లు పరిష్కరించాలని టార్గెట్ పెట్టారు.
బాధ్యులపై చర్యలేవీ?
రైతుల కష్టాలతో చలించిన ప్రభుత్వం సత్వరమే పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత 24 నెలలుగా అనేక దఫాలుగా కలెక్టర్లను ఆదేశించింది. రాజకీయ, ఇతర కారణాలతో అన్యాయంగా 22(ఏ)లో ఉంచిన పట్టా భూములను గుర్తించి విముక్తి కల్పించాలని అనేక ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కొందరు కలెక్టర్లు స్పందించలేదు. ఏళ్ల తరబడి తమ లాగిన్‌లో ఉన్న ఫైళ్లను పట్టించుకోలేదు. ఏ జిల్లాలో ఎన్ని పైళ్లు అన్యాయంగా నిషేధిత జాబితాలో ఉంచారో ఇప్పుడు ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. మరీ 8 జిల్లాల పరిధిలో కలెక్టర్లు 22(ఏ)ఫైళ్లను సుదీర్ఘకాలం పరిష్కరించకుండా పెండింగ్ పెట్టారని తేలింది. కలెక్టర్లు ఇలా పెండింగ్ పెట్టడం నిబంధనలకు విరుద్ధ్దం. రైతులకు అన్యాయం చేయడమే. అలాంటి తప్పులు చేసిన కలెక్టర్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు సొంత కారణాలతో ఫైళ్లను పెండింగ్ పెట్టినట్లుగా పలు కేసుల్లో తెలుస్తోంది. అలాంటి కేసులు ఏమిటో రెవెన్యూ శాఖ వద్ద స్పష్టమైన వివరాలున్నాయి. ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టిన కలెక్టర్లు ఎవరో తెలిసినా ప్రభుత్వం వారిపై కనీసం విచారణకు ఆదేశించలేదు. ప్రజల పట్టా భూములకు విముక్తి కల్పించాలనుకున్న ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో కలెక్టర్లు నెరవేర్చకపోవడం కూడా తీవ్రమైన తప్పిదమే అని అధికారవర్గాలు చెబుతున్నాయి.