Share News

16 లక్షల ఎకరాలకు విముక్తి

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:12 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక 22ఏ జాబితా నుంచి 16 లక్షల ఎకరాల భూములను తొలగించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మీ భూమిపై మీకు హక్కు కల్పించేందుకు పనిచేస్తున్నామని అన్నారు.

16 లక్షల ఎకరాలకు విముక్తి

  • వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములు కాజేయాలనుకుంది: సీఎం

  • టైట్లింగ్‌ యాక్టుతో రికార్డులు ధ్వంసం

  • కూటమి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశాం

  • దశాబ్దాల భూసమస్యలకు పరిష్కారం

  • గ్రౌండ్‌ రెంట్‌ భూములకు విముక్తి

  • కోనసీమ జిల్లాలో 56.37 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాం

  • హైసెక్యూరిటీతో పాస్‌ పుస్తకాలు ఇస్తున్నాం

  • పాత మద్యం షాపులు రెన్యువల్‌ చేస్తాం

  • ఆకాశమే హద్దుగా కోనసీమ అభివృద్ధి

  • ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం వెల్లడి

నీరు జీవనమైతే.. భూమి జీవితం. అందుకే ఈ రెండు కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. అభివృద్ధి చేయాలి.. సంపద సృష్టించాలి.. జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవంగా జీవించేలా కృషి చేస్తున్నాం.

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకుపైగా నీరు సముద్రంపాలైంది. ఆ నీటిని వినియోగించుకోగలిగితే మనందరికీ ఎంతో ప్రయోజనం. ఈ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

- సీఎం చంద్రబాబు

అమలాపురం/అంబాజీపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక 22ఏ జాబితా నుంచి 16 లక్షల ఎకరాల భూములను తొలగించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మీ భూమిపై మీకు హక్కు కల్పించేందుకు పనిచేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రికార్డులను తారుమారు చేసి ధ్వంసం చేశారని..ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు తెచ్చి ప్రజల భూములను కాజేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అందుకే తాను అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశానని ప్రకటించారు.


బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మాచవరంలో మీభూమి-మీహక్కు సభలో ఆయన పాల్గొన్నారు. కె.పెదపూడి, చిరతపూడి గ్రామాలకు చెందిన 1790 మంది రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గంటా 45 నిమిషాలు మాట్లాడారు. ‘పూర్వీకులు ఇచ్చిన భూములకు చెందిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలపై గత పాలకులు వారి ఫొటోలు వేసుకున్నారు. సర్వే రాళ్లపై బొమ్మల పిచ్చి ఏమిటో అర్థం కాలేదు. ఇష్టంలేని వ్యక్తుల భూములను, ఆస్తులను 22ఏ జాబితాలో పెట్టేసి ఇబ్బందులు పెట్టారు. అందుకే పటిష్ఠంగా రీసర్వే చేసి ఎక్కడా అవకతవకలు లేకుండా రాజముద్రతో కూడిన హైసెక్యూరిటీ పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్నాం. ఈకేవైసీ, క్యూఆర్‌ కోడ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి భద్రతా ఫీచర్లతో వాటిని ఇస్తున్నాం’ అని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 224 భూ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కలిదిండి, కొంగొంది, ముదినేపల్లి వంటిచోట్ల సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరించామన్నారు. అమలాపురం, మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రపురాల్లో 1908 నుంచి 22ఏ కింద భూములు నిషేధంలో ఉన్నాయని.. బ్రిటిషర్లు చేసిన చట్టాన్ని రద్దు చేసినా పట్టాలు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వాటిని తొలగిస్తూ 56.37 ఎకరాల భూమిని కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,410 మందికి లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. గొడ్డలి పార్టీ తారుమారు చేసిన రికార్డులను ప్రక్షాళన చేసి భూసమస్యలను కొలిక్కి తెస్తున్నామని.. త్వరలోనే ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రకటించారు. సంవత్సరంలోగా రెవెన్యూలో అన్ని సమస్యలు పరిష్కరించి సమస్యలు లేని శాఖగా తీర్చిదిద్దుతామన్నారు. రూ.240 కోట్లతో కోనసీమ పవర్‌గ్రిడ్‌ ఆధునికీకరణ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


విభజన కంటే ఎక్కువ నష్టం..

2019-24 నడుమ రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం ఆంధ్రప్రదేశ్‌కు వాటిల్లింది. పోలవరం డయాఫ్రం వాల్‌ను కక్షతో గోదావరిలో కలిపేశారు. రాజకీయ కక్షతో కాంట్రాక్టరును మార్చకుండా ఉంటే 2021కే ప్రాజెక్టు పూర్తయ్యేది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఏపీని ఆదుకుని ఉండేది. గ్రూప్‌-1 పరీక్షల పేపర్లను ఎలక్ర్టీషియన్లు, డ్రైవర్లతో దిద్దించి అవకతవకలకు పాల్పడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. 30వేల మంది కల్తీ మద్యం కారణంగా చనిపోయారు. ఎంతోమంది ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. వైసీపీ ప్రజల జీవితాలతో ఆడుకుంది. 2024లో వారు విజ్ఞతతో ఆలోచించి కూటమికి మద్దతిచ్చారు. ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే ప్రతి నెలలో వీలైనన్నిసార్లు ప్రజల మధ్యకు వచ్చి వారి బాగోగులు తెలుసుకుంటున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపైనే ప్రధానంగా దృష్టి సారించి పాలన అందిస్తున్నా. మెగా డీఎస్సీతో టీచరు పోస్టులు ఇవ్వాలని భావిస్తే 300 కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు ఆ టీచర్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. గొడ్డలి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బెదిరిపోం. గట్టిగా పోరాడతాం. రాష్ట్రంలో ఈ నెలాఖరుతో ఎక్సైజ్‌ పాలసీ ముగుస్తుంది. అయితే మద్యం దుకాణాలకు కొత్తగా వేలం నిర్వహించకుండా.. ప్రస్తుతం ఉన్నవాటినే రెన్యువల్‌ చేస్తాం. మద్యం ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాయలసీమ కంటే కోనసీమ తలసరి ఆదాయం తక్కువ. కోనసీమను ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ టూరిజానికి అవకాశాలున్నాయి. కొబ్బరి తోటల్లో అంతర పంటలతోపాటు కొబ్బరి అధారిత పంటలు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవాలి.


లబ్ధిదారుల నివాసాలకు చంద్రబాబు

మీ భూమి మీ హక్కు కార్యక్రమం అనంతరం ఆయన మాచవరం పరిధిలోని జయంతినగర్‌లో లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రహదారులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీంతో కమ్యూనిటీ భవనాన్ని, రహదారులు మంజూరు చేయడంతో పాటు జయంతినగర్‌లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులు కత్తుల నాగమణి-బాబులు, నెల్లి సునీత ఇంటికి వెళ్లిన సీఎం అక్కడి అరుగుపై కూర్చుని మాట్లాడారు. 22ఏ నుంచి వారి భూములకు విముక్తి కల్పిస్తూ భూమి పత్రాలను అందజేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏఆర్‌టీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు

Updated Date - Sep 10 , 2026 | 04:47 AM