Share News

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ భారీ మోసం.. అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:11 PM

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ భారీ మోసం.. అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్
Land Loan Fraud

అమరావతి, ఆగస్టు 16: భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి, భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో యుగంధర్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2016 నుంచి 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 12 క్రిమినల్ కేసులతో పాటు 8 సివిల్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (NI) యాక్ట్‌కు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఓ బాధితుడికి రూ.60 లక్షల ఆర్థిక సాయం ఇప్పిస్తానంటూ MOU చేసుకున్న యుగంధర్, అతడికి తెలియకుండా ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి మూడో వ్యక్తి పేరిట ఆస్తిని బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం అదే ఆస్తిని ఆధారంగా చేసుకుని యాక్సిస్ బ్యాంక్ నుంచి ఏకంగా రూ.1.50 కోట్ల రుణం తీసుకున్నాడు. రుణం డిఫాల్ట్ కావడంతో బ్యాంకు నుంచి బాధితుడికి నోటీసులు రావడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ అధికారులు యుగంధర్ వ్యవహారాలను బయటకు తీశారు.


దర్యాప్తులో యుగంధర్ ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకూ 30 మందికి పైగా బాధితులు ఉన్నట్లు, వారి నుంచి రూ.10 కోట్లకు పైగా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. భూములు, ఆస్తులపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ బాధితులను నమ్మించడం, వారి నుంచి ఆస్తి పత్రాలు తీసుకోవడం, అనంతరం వాటిని దుర్వినియోగం చేసి మూడో వ్యక్తుల పేరిట బదిలీ చేయడం లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ మొత్తంలో రుణాలు పొందడం అతడి మోసాల తీరుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఆస్తి పత్రాలు, MOUలు, ఇతర కీలక డాక్యుమెంట్లను ఎవరికైనా అప్పగించే ముందు పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని, రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే వ్యక్తుల మాటలను గుడ్డిగా నమ్మవద్దని సీసీఎస్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

Updated Date - Aug 16 , 2026 | 07:36 PM