India US Relations In 2025: భారత్‌పై కక్ష గట్టిన ట్రంప్.. 2025లో జరిగిందిదే..
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:21 PM
భారత్, అమెరికాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. 2025 సంవత్సరం మొత్తం టారీఫ్‌ల వివాదంతో గడిచిపోయింది. ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా భారత్‌లపై టారీఫ్‌లు విధించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో భారత్ బాగా నష్టపోయింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్‌కు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని రకాలుగా భారత్‌ను కష్టాల్లో పడేశాయి. ఒకరకంగా చెప్పాలంటే 2025లో భారత్, అమెరికాల మధ్య సంబంధం టారీఫ్‌ల వివాదంతోటే గడిచిపోయింది. అవకాశం ఉన్న ప్రతీ దానిపై ట్రంప్ టారీఫ్‌లు వేసేశారు. తమ దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదన్న కోపంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదన్న కారణంతో ఆగస్టు నెలలో భారత్‌పై ఏకంగా 50 శాతం టారీఫ్‌లు వేశారు.
రెండు దేశాల మధ్య చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. రష్యాతో ఇండియా ఆయిల్ కొనుగోలు చేయటం ఇష్టం లేని ట్రంప్ బెదిరింపులకు దిగారు. రష్యాతో వ్యాపారం మానుకోకపోతే మరిన్ని టారీఫ్‌లు వేస్తామని అన్నారు. ఇలాంటి సమయంలో గత ఆగస్టు నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ మోదీ, పుతిన్, జిన్ పింగ్ కలిశారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ముగ్గురూ కలవటంపై ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో సెప్టెంబర్ 5వ తేదీన క్రిప్టిక్ మెసేజ్ పెట్టారు. పది రోజుల తర్వాత భారతీయులకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు.
హెచ్ 1 బీ వీసాల పీజు భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా ఫీజులను ఏడాదికి 1,00,000 డాలర్లు (సుమారు రూ.84 లక్షలు) వరకు పెంచారు. హెచ్ 1బీ వీసాల రుసుము పెంచిన కొన్ని రోజులకు మరో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ చిత్రాలపై ఏకంగా 100 శాతం టారీఫ్‌లు విధించారు. అమెరికాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో భారత చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఇంతటితో ట్రంప్ కక్ష సాధింపు చర్యలు ఆగలేదు. భారత్‌నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంపై 50 శాతం టారీఫ్‌లు విధించారు.
డిసెంబర్ 8వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ అమెరికాలోని రైతులకోసం మల్టీ బిలియన్ డాలర్ రిలీఫ్ ఫ్యాకేజ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్, ఇతర ఆసియా దేశాలనుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై విమర్శలు సైతం గుప్పించారు. ఇతర దేశాలనుంచి వస్తువుల్ని అమెరికాలోకి దిగుమతి చేసుకోవటం స్థానిక ఉత్పత్తిదారులకు సవాలుగా మారిందని అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులను రక్షించటం కోసం, దిగుమతులకు అడ్డుకట్ట వేయటం కోసం భారీ మొత్తంలో టారిఫ్‌లు వేస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు ఎంతో అవసరమైన జాతీయ ఆస్థి. అమెరికాకు వెన్నెముక లాంటి వారు’ అని అన్నారు.
రష్యా, చైనాలను తమ దారిలోకి తెచ్చుకోవడానికి భారత్‌ను అమెరికా పావుగా వాడుకుంటోందని అమెరికాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే సంబంధాలు మరింత దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అయితే, రెండు దేశాల మధ్య భవిష్యత్ వాషింగ్టన్, ఢిల్లీ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 2026లో అయినా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..