Ginger: ‘అ’ అంటే ‘అల్లం’.. ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా..
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:40 PM
భూమిలోపల అలముకుంటుంది (వ్యాపిస్తుంది) కాబట్టి అల్లం అయ్యింది. తెలుగువాళ్లు శాస్త్రీయంగా పేర్లు పెట్టటంలో దిట్టలనటానికి అల్లమే సాక్షి! పచ్చి అల్లంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని ఆర్ద్రకం అన్నారు.
ఆరడుగుల దేహానికి అరంగుళం అల్లం ముక్క రక్షణ కవచంలా నిలిచే ఔషధశక్తి. అందుకే దీన్ని మహౌషధి అన్నారు. కరోనా కాలంలో జనం ప్రాణాలు కాపాడిన దివ్యౌషధం కదా అల్లం!
వాతవ్యాధులు పేగుల్లోనే పుడతాయి. వాతాన్ని పేగుల్లోనే అణిచేసి శరీరాన్ని కాపాడే అగ్నిజాతశక్తి అల్లం. పేగులు ‘మోరీ’లా తయారైతే దాన్ని చీపురులా నిర్మలంగా కడిగే సహజ రక్షక ఆయుధం అల్లం. గడియారం గంట కొట్టినంత ఠంచనుగా కాలవిరేచనం అయ్యేలా చేసేది అల్లం. వాతాన్ని, కఫాన్ని ఎండగట్టి శరీర ధర్మాన్ని నిలబెట్టే ఓ సుగంధ మంత్రం అల్లం.
‘అ’ అంటే అల్లం. అన్నాన్ని అల్లంతో మొదలు పెట్టాలంటుంది ఆయుర్వేదశాస్త్రం. అల్లమూ, తగినంత సైంధవ లవణమూ కలిపి ముద్దగా నూరి రోజూ అన్నంలో ఒక చెంచాడు మొదటి ముద్దగా తినండి. రోగం వచ్చే దారిలో ద్వారపాలకుడుగా నిలుస్తుంది. వాతం, సయా టికా నడుంనొప్పి, మెడనొప్పి, మడమ నొప్పి, మోకాళ్ళ నొప్పులకు ఇది అద్భుత చికిత్స! అన్నంలో ముందుగా స్వీటు తింటే ఆకలి మసకబారుతుంది. అల్లం తింటే జాఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది! స్థూలకాయానికి, కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
ఊపిరి తిత్తుల్ని కమ్ముకున్న కఫాన్ని ఎండించే అగ్నిశక్తి అల్లం. దగ్గు, జలుబు, ఉబ్బసం, ఆయాసాలకు అల్లం జవాబుదారిగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులతో ఉధృతమయ్యే అలర్జీల్ని అల్లం అడ్డుకుంటుంది. పడిశభారం తక్షణం తగ్గుతుంది. దగ్గు,ఉబ్బసం శాంతిస్తాయి. రక్తహీనతతో అలసట, లివర్ దౌర్భల్యాలు, కడుపులో ఎసిడిటీ, కడుపు నొప్పి, మూత్రంలో మంటల్ని తగ్గిస్తుంది. బోదకాలు వ్యాధికి అల్లం గొప్ప ఔషధం. ‘వృషణాలలో వాపు’ వచ్చిన వారికి ఇది మేలు చేస్తుంది. షుగరు, బీపీల్ని తగిస్తుందే గానీ పెంచదు. బక్కచిక్కిపోయేవాళ్లకీ, క్షీణింపచేసే టీబీ, మస్క్యులర్ డిస్ట్రఫీ లాంటి వ్యాధులకీ అల్లమే అణ్వాయుధం! జీవశక్తిని తట్టి లేపుతుంది.

అల్లం ముక్కలూ+సైంధవ లవణం+అవి మునిగేదాకా నిమ్మరసం+కావాలనుకుంటే తగినంత తేనె కలిపి, గాజు సీసాలో భద్రపరు చుకుని, రోజూ ఒక చెంచాడు తీసుకుంటే పైన చెప్పిన లక్షణాలన్నీ తగ్గుతాయి. మనసు సంగీతంలా ప్రశాంతంగా ఉంటుంది. అలసట తీరుస్తుంది. చిరాకులు పరాకులు తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. పరీక్షల్లో కష్టపడే విద్యార్థులకు రోజూ దీన్ని ఇవ్వండి. పిల్లలు తేలికగా పరీక్షలు రాస్తారు.
అల్లం రసానికి సమంగా తేనె కలిపి అర కప్పు చొప్పున రోజూ రాత్రిపూట తాగుతుంటే, మగవాళ్లు కొత్త పెళ్లికొడుకులా తయారవు తారు. వీర్యకణాలు తక్కువగా వున్నవాళ్లలో కణాల పుట్టుకకు సహకరిస్తుంది. వీర్యస్కలనం సరిగా జరిగేలా చేస్తుంది. తరచూ నోటిపూత రావటాన్ని ఆపుతుంది. క్యాల్షియం,బి-విటమిన్లు, ఇనుము వగైరా పోషకాల లోపాలతో బాధపడే వాళ్లు అల్లాన్ని సక్రమంగా వాడితే పోషకాలు వంటపడతాయి. మందులు పనిచేస్తాయి.
అల్లాన్ని ఎండిస్తే శొంఠి అవుతుంది. అల్లాని కున్న గుణాలన్నీ శొంఠికున్నాయి. వేడి చేయ కుండా పనిచేస్తుంది. శొంఠిని కాల్చి, మెత్తగా దంచి సైంధవలవణం తగినంత కలిపి మజ్జిగలో వేసుకుని రోజూ తాగితే ఈ గుణాలన్నీ కలుగుతాయి. అల్లం ఓ అగ్నికణం. దాన్ని పరిమితంగానే వాడుకోవాలి. మోతాదెక్కువైతే తగ్గే గుణాలన్నీ పెరుగుతాయన్నది హెచ్చరిక. అతి అన్ని వేళలా వదలాల్సిందే కదా!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఆలూ దోశ
కావలసిన పదార్థాలు: ఆలూ (ఉడికించినవి)- మూడు, వరి పిండి - ఒకటిన్నర కప్పు, రవ్వ - పావు కప్పు, ఉల్లి ముక్కలు - కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - నాలుగు, కరివేపాకు రెబ్బలు - కొన్ని, జీలకర్ర - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, నూనె, నీళ్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ఆలూ, కొంచెం నీళ్లను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ ఆలూ పేస్టును పేద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో వరి పిండి, రవ్వ, ఉప్పు వేసి తగినంత నీళ్లతో కలపాలి. ఇంకా ఉల్లి, కొత్తిమీర, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్రను జతచేసి కాస్త నీటిని కలిపి జారుగా చేసుకుని మూతపెట్టాలి. పది నిమిషాల తరవాత దోశలు వేసుకుంటే కరకరలాడే ఆలూ దోశ రెడీ.
పల్లీ, నువ్వుల లడ్డు
కావలసిన పదార్థాలు: నువ్వులు - ఒకటిన్నర కప్పు, పల్లీలు -
అర కప్పు, బెల్లం - కప్పు, యాలకుల పొడి - అర స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: నువ్వులను బాణలిలో తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఘుమఘుమలాడుతుంటే దించేసి చల్లారనివ్వాలి. ఇలాగే పల్లీలను కూడా వేయించుకోవాలి. పొట్టుతీసి చల్లారబెట్టాలి. తరవాత రెండింటినీ మిక్సీ పట్టాలి. బెల్లం కూడా వేసి మరోసారి మిక్సీ తిప్పి పళ్లెంలో వేసుకోవాలి. ఈ మిశ్రమానికి నెయ్యి, యాలకుల పొడి కలిపి లడ్డూల్లా వత్తుకుంటే సరి.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా గృహ రుణం రావటం లేదా
Read Latest Telangana News and National News