Share News

Hyderabad Crime: ఎంపీ కుమారుడిని.. న్యూరో సర్జన్‌ని!

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:21 AM

బెంజ్‌ కారు.. వెంట బౌన్సర్లతో దర్పం ప్రదర్శిస్తూ.. ఎంపీ కుమారుడినని, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad Crime: ఎంపీ కుమారుడిని.. న్యూరో సర్జన్‌ని!

  • అద్దె బెంజ్‌ కార్లు.. చుట్టూ బౌన్సర్లతో డాబు

  • ఏపీకి చెందిన ఘరానా మోసగాడి అరెస్టు

హైదర్‌నగర్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): బెంజ్‌ కారు.. వెంట బౌన్సర్లతో దర్పం ప్రదర్శిస్తూ.. ఎంపీ కుమారుడినని, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ ఎస్సై శ్రీలతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా చిన్ననట్టుకి చెందిన వాయిల వెంకటేశ్వర్లు (29) విశాఖపట్నం రిషికొండలో నివసిస్తుంటాడు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ఉమెన్స్‌ పీజీ హాస్టల్‌కు వెళ్లాడు. హాస్టల్‌ నిర్వాహకురాలికి తాను ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కుమారుడినని, పేరు విక్రాంత్‌ రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు.


తన బంధువులు, జూనియర్‌ డాక్టర్లను హాస్టల్‌లో చేర్పించే నెపంతో తన అనుచరులతో వచ్చి హడావుడి చేశాడు. అతన్ని హాస్టల్‌ నిర్వాహకురాలు బాగా నమ్మింది. ఈ క్రమంలో తమకు జూబ్లీహిల్స్‌లో జ్యువెలరీ షాపు ఉందని, ఆమె 4 తులాల బంగారు గొలుసును రీమోడలింగ్‌ చేయిస్తానని తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.55 వేలు, మరోసారి రూ.45 వేలు తీసుకున్నాడు. తర్వాత కనిపించలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశ్వర్లును కేపీహెచ్‌బీలో అరెస్టు చేసి, అతని నుంచి రెండు బెంజ్‌ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అతను గతంలోనూ అద్దెకు తీసుకున్న బెంజ్‌ కార్లలో తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని, అతనిపై ఏపీలో 12 కేసులు, హైదరాబాద్‌లో రెండు కేసులు ఉండగా ఓ సారి జైలుశిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. .


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:21 AM