Share News

Young Sub-Inspectors: దోచుకునేందుకే పోలీస్ డిపార్టుమెంట్‏లోకి...

ABN , Publish Date - Nov 27 , 2025 | 07:46 AM

నగరంలో పనిచేస్తున్న కొంతమంది యువ ఎస్సైల పనితీరు వివాదాస్పదమవుతోంది. వారు.. కేవలం దోచుకునేందుకే డిపార్టుమెంట్ లోకి వస్తున్నారా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలొస్తున్నారయి. యూనిఫారం ధరించిన నాటినుంచే అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి.

Young Sub-Inspectors: దోచుకునేందుకే పోలీస్ డిపార్టుమెంట్‏లోకి...

- వివాదాస్పదంగా కొందరు యువ ఎస్‌ఐల తీరు

- ప్రొబేషనరీ కాలం పూర్తి కాకుండానే లంచాల మేత

- సమయానికి స్టేషన్‌కు రారు.. మాటంటే పడరు!

2020 బ్యాచ్‌కు చెందిన ఓ ఎస్‌ఐ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు.. క్రైమ్‌ డిటెక్షన్‌లో దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని తన అవసరాలకు కుదవబెట్టుకున్నాడు. రికవరీ విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద దాచిపెట్టాడు. బెట్టింగ్‌ మోజులో పడి అప్పులపాలయ్యాడు. రికవరీ చేసిన బంగారంతో పాటు.. డబ్బుకోసం తన సర్వీస్‌ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యువ ఎస్‌ఐ విధినిర్వహణలో భాగంగా ఖాకీ డ్రెస్‌లో ఉన్నా.. గడ్డంతో, తెల్లబూట్లు ధరించి ఉన్నాడు. యూనిఫాం వేసుకొని క్లీన్‌ షేవ్‌ చేసుకోకుండా, డిపార్ట్‌మెంట్‌ షూ వేసుకోకుండా స్టైల్‌గా వచ్చాడు. ఉన్నతాధికారి ప్రశ్నిస్తే.. ‘ఏముందిలే సార్‌.. ఏదో కనిపించకుండా చిన్నగా గడ్డం ఉంచాను. షూ విషయంలో పట్టించుకుంటే ఎలా సార్‌’ అని సమాధానం ఇచ్చాడు. దాంతో ఉన్నతాధికారి ఆశ్చర్యానికి గురయ్యారు.


city3.jpg

- ఇటీవల ఉద్యోగంలో చేరిన ఓ మహిళా ఎస్‌ఐ.. ప్రతీరోజూ విధులకు ఆలస్యంగా వస్తోంది. ఇదేంటమ్మా.. కొత్తగా ఉద్యోగంలో చేరావు.. బాధ్యత లేకుండా ప్రతీరోజూ ఆలస్యంగా వస్తే ఎలా, రోల్‌కాల్‌ ఉంటుందని తెలుసుకదా అని ఎస్‌హెచ్‌వో మందలించారు. అయినా పట్టించుకోకుండా రోజులతరబడి అలాగే చేసింది. దాంతో నీ ఇష్టం చార్జిమెమో ఇస్తున్నాను అని హెచ్చరించాడు. ప్రొబేషనరీలో ఇలాంటి రిమార్క్స్‌ ఉండొద్దని హెచ్చరించాను.. అయినా మీరు వినకపోతే ఎలా అని గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారు. దాంతో మహిళా ఎస్‌ఐ నొచ్చుకుంది. తనను ఎస్‌హెచ్‌వో టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.


- మరో స్టేషన్‌లో ఓ ఎస్‌హెచ్‌వోకు కొత్త ఎస్‌ఐ విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. కొద్దిరోజులు ఓపికగా హెచ్చరించిన ఎస్‌హెచ్‌వో తర్వాత చార్జి మెమో ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి పోలీస్‌ శాఖలోకి వస్తున్న కొంతమంది యువ ఖాకీలు డబ్బుకోసమే పోలీస్‌ డిపార్టుమెంట్‌లోకి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కేసు వస్తే కాసుల కోసం ఆరాటపడుతున్నారంటే అతిశయోక్తికాదు. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతీ పీఎ్‌సలోనూ ఉండటంతో ఎస్‌హెచ్‌వో నుంచి సీపీల వరకూ తలలు పట్టుకుంటున్నారు.


city3.2.jpg

యంగ్‌స్టర్స్‌.. డేంజరస్‌

ప్రస్తుతం పోలీస్‌ శాఖలోకి ఉన్నత విద్యావంతులు వస్తున్నారు. ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లుగా నియమితులవుతుండటంతో బాధిత ప్రజలకు న్యాయం చేస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పోలీస్‌ శాఖలోకి వస్తున్న యువతకు ఉన్నత విద్యతో పాటు ఆధునిక టెక్నాలజీ, కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉండటంతో కేసుల ఛేదన, నేర నియంత్రణ వేగవంతంగా జరుగుతుందని అభిప్రాయం. యువ పోలీస్‌ అధికారులపై ఉన్నతాధికారులు ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటే.. కొంతమంది తీరు అందుకు భిన్నంగా ఉంది. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పోలీస్‌ ఉద్యోగంలోకి వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు.


ప్రతీ కేసులోనూ బాధితులను, నిందితులను డబ్బుకోసం పీడిస్తూ.. పోలీస్‌ శాఖ పరువు తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే పోలీసులపై ప్రజలకు కలుగుతున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ప్రొబేషనరీ కాలం పూర్తి కాకుండానే అవినీతికి, అక్రమ సంపాదనకు అలవాటుపడి అందినకాడికి దండుకుంటున్నారు. ఎన్నో ఉన్నత పదవులు పొందాల్సిన వీరు.. డిపార్టుమెంట్‌లోకి రాగానే లంచాల దుకాణం తెరుస్తున్నారంటే డబ్బు కోసం ఏ స్థాయిలో అడ్డదారులు తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అఽధికారుల తీరు పోలీస్‌ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 09:07 AM