World Bank: 4,150 కోట్లు..
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:53 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం
ఫలించిన సర్కారు ప్రయత్నం.. సీఎస్‌కు వరల్డ్ బ్యాంకు లేఖ
రుణంతో ట్రామాకేర్, డయాలసిస్, 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు
ఫలితాల ఆధారంగా ఆరేళ్లలో దశలవారీగా నిధుల అందజేత
రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో వైద్యసేవల పరిశీలన
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది. ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాల కల్పనతోపాటు పలు కార్యక్రమాల అమలుకుగాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు అంగీకరించింది. రూ.4,150 కోట్ల రుణం ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ పంపింది. ఈ రుణాన్ని ఆరేళ్లపాటు దశలవారీగా అందించనున్నట్టు పేర్కొంది. ఆరోగ్యశాఖలో అమలు చేసే కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు నిధులిస్తుంది. కార్యక్రమాల అమలు, వాటి ఫలితాల ఆధారంగా ఈ నిధులను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతో కలిసి పనిచేస్తుంది. వచ్చే ఆరేళ్లు ఈ బృందం సాంకేతిక, ఇతర సహాయ సహకారాలను అందజేయనుంది. ప్రస్తుతం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఇక నుంచి ప్రతి నెలా ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
ఆ మూడు అంశాలపై ఆరా...
ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం వైద్యశాఖలో కీలకమైన కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్య విద్య సంచాలకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులతో భేటీ అయింది. ప్రధానంగా మూడు అంశాలపై హెచ్‌వోడీల నుంచి వివరాలు సేకరించింది. ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (బీడబ్ల్యూఎం)సేఫ్టీ, మానవ వనరుల గురించి ఆరా తీసింది. ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి? వ్యర్థాలను ఎలా డిస్పోజ్ చేస్తున్నారు? ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కొరత ఎంత అంశాలపై రిపోర్టులు తీసుకుంది. అలాగే క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సరోజిని కంటి ఆస్పత్రిని సందర్శించింది. ఇక్కడి వైద్యసేవలు, బీడబ్ల్యూఎంపై ఆరా తీసింది. గురువారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట యూసీహెచ్‌సీ, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రి, తిలక్‌నగర్ యూపీహెచ్‌ఏసీ, అన్నోజిగూడ హెల్త్‌సెంటర్‌ను ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించనుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి.
నిధుల వినియోగం ఇలా!
ప్రపంచ బ్యాంకు రుణం ప్రధానంగా నాలుగైదు విభాగాలకే ఉండనున్నట్లు తెలుస్తోంది. మహిళల ఆరోగ్యం, అసాంక్రమిక వ్యాధులు (ఎన్‌సీడీ), వయోవృద్ధుల ఆరోగ్యం, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రామాకేంద్రాల ఏర్పాటుకు పెద్దయెత్తున నిధులు ఇవ్వనుంది. ప్రపంచబ్యాంకు సాయంతో జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కి.మీ.కు ఒక ట్రామాకేర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా ట్రామా కేర్ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి ఇందుకు రూ.1,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రమాదం జరిగితే బాధితుల వద్దకు 8 నిమిషాల్లోపు అంబులెన్స్‌లు చేరుకునేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఒక్కొక్కటి రూ.30కోట్లతో ఏర్పాటు చేస్తా రు. అలాగే ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రపంచబ్యాంకు నిధులను వినియోగించనున్నారు. పదిచోట్ల అవయవాల సేకరణ, నిల్వ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, జిల్లాల్లో డయాలసిస్, ఐవీఎఫ్ కేంద్రాలను ఆ నిఽధులతో ఏర్పాటు చేయనున్నారు.
గతేడాది నుంచి ప్రయత్నాలు..
వరల్డ్ బ్యాంకు సాయం కోసం గత సెప్టెంబరు నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని ‘‘ఆంధ్రజ్యోతి’’ ముందే చెప్పింది. గత సెప్టెంబరు 15న ‘‘వైద్యానికి 5 వేల కోట్లు’’ పేరిట కథనాన్ని ప్రచురించింది. ప్రతిపాదనలను గతేడాది సర్కారు కేం ద్రానికి పంపగా, వాటిని కేంద్రం ప్రపంచ బ్యాం కుకు పంపింది. మౌలిక సదుపాయాలు, మాన వ వనరులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పరికరాల కొనుగోలు, ఎన్‌సీడీ స్ర్కీనింగ్, బీపీ, షుగర్ బాధితులకు ఔషధాల పంపిణీ తదిత రాల కోసం రూ.4,944 కోట్ల ప్రతిపాదనలను రాష్ట్రప్రభుత్వం పంపగా.. రూ.4,150కోట్ల సాయానికి ప్రపంచబ్యాంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News