Suicide: ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాగించి.. తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:02 AM
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లలు మృతి చెందారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిల్లలు మృతి
భర్త వేధింపులతో వివాహిత అఘాయిత్యం
పెగడపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): భర్త వేధింపులు, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లలు మృతి చెందారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల తిరుపతికి జగిత్యాలకు చెందిన హారిక (30)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు కృష్ణంత్ (12), కుమార్తె మయంత్‌లక్ష్మి (10) ఉన్నారు. తిరుపతి వ్యవసాయంతో పాటు ఒగ్గు కథలు చెప్పడానికి వెళుతుండగా, హారిక వ్యవసాయ పనులకు వెళ్తుండేది. ఈ నెల 13న తిరుపతి వేరే గ్రామానికి ఒగ్గు కథ చెప్పడానికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న హారిక పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలకు తాగించి భర్తకు ఫోన్ చేసి తెలిపింది.
వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు చికిత్స నిమిత్తం వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ హారిక ఈ నెల 14న మృతి చెందగా, పిల్లలు కృష్ణంత్, మయంత్‌లక్ష్మి ఆదివారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా తిరుపతి వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు తమ కూతురిని వరకట్నం తేవాలని వేధిస్తుండటంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పిల్లల మృతదేహాలను ఇంట్లోనే గొయ్యి తవ్వి పూడ్చిపెడతామని బంధువులు ఆందోళన చేయడంతో మద్దులపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాలకు శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..