Share News

Shankarpally: రైలు పట్టాలపై కారు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:54 AM

ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో రైలు పట్టాలపై కారుతో దూసుకెళ్లిన ఓ మహిళ నానా హంగామా సృష్టించింది. ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై కారులో ప్రయాణించి రైల్వే అధికారులు, పోలీసులను పరుగులు పెట్టించింది.

Shankarpally: రైలు పట్టాలపై కారు

  • ఆత్మహత్యాయత్నంలో భాగంగా యూపీ మహిళ హల్‌చల్‌

  • పట్టాలపై 7 కి.మీ.లు ప్రయాణం

  • రంగారెడ్డి జిల్లాలో ఘటన

  • అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • పలు రైళ్లకు అంతరాయం

శంకర్‌పల్లి, జూన్‌26 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో రైలు పట్టాలపై కారుతో దూసుకెళ్లిన ఓ మహిళ నానా హంగామా సృష్టించింది. ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై కారులో ప్రయాణించి రైల్వే అధికారులు, పోలీసులను పరుగులు పెట్టించింది. రైల్వే పోలీసులు అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకోగా.. ఆమె తీరు వల్ల పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓమికా సోని(34) కొంతకాలంగా హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఉంటున్నారు. క్యాప్‌జెమినీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఓమికా 2022లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పట్నించి ఒంటరిగా ఉంటున్న ఆమె 3 నెలల క్రితం ఉద్యోగం పోగొట్టుకున్నారు. అయితే, గురువారం తెల్లవారుజామున తన కియా సోనెట్‌ కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఓమికా.. రంగారెడ్డి జిల్లా కొండకల్‌ రైల్వేగేట్‌ వద్ద కారును పట్టాలపైకి ఎక్కించి బుల్కాపూర్‌, చిన్నశంకర్‌పల్లి మీదుగా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ వరకు సుమారు 7కి.మీలు రైల్వే ట్రాక్‌పై నడిపారు.


సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పట్టాలను క్రాసింగ్‌ చేసి కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రైల్వే సిబ్బంది కారు అద్దాలను ధ్వంసం చేసి ఆమెను బయటికి లాగే యత్నం చేయగా.. తన వద్ద ఉన్న నాన్‌చాక్‌తో ఓమికా వాళ్లని బెదిరించారు. మారథాన్‌ రన్నర్‌ అయిన ఓమికా తీవ్రంగా ప్రతిఘటించడంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఆమె చేతులను తువ్వాలుతో కట్టేసి శంకర్‌పల్లి పోలీసు స్టేషన్‌కి తరలించి విచారించారు. ఓమికా తండ్రి ఫోన్‌ నెంబర్‌ తప్ప మరే వివరాలను పోలీసులు రాబట్టలేకపోయారు. అనంతరం ఓమికాను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. సహకరించకపోవడంతో వైద్యులు ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయితే, రైల్వే పోలీసులు ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఓమికా సోని ఆత్మహత్య చేసుకోవడానికే కారుతో రైల్వే ట్రాక్‌పైకి వెళ్లారని.. ఈ మేరకు కేసు నమోదు చేశామని నాంపల్లి రైల్వే సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీసులను దుర్భాషలాడినందున ఆమెపై శంకర్‌పల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఓమికా సోని రెండు నెలలుగా తమతోనూ సరిగా మాట్లాడటం లేదని, మతి భ్రమించినట్లు వ్యవహరించేదని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఓమికా సోని కారుతో రైలు పట్టాలపైకి రావడంతో.. ఆ సమయంలో ఆ ట్రాక్‌పై వెళ్లాల్సిన రైళ్లను శంకర్‌పల్లి స్టేషన్‌మాస్టర్‌ వెంటనే ఆపేశారు.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:54 AM