Minister Ponguleti: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:03 PM
రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.

హనుమకొండ: రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. రైతు భరోసా కింద లబ్ధిదారులకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే భూమి లేని నిరుపేదలకు సైతం రూ.12 వేలు ఇవ్వనున్నట్లు పొంగులేటి చెప్పారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‍లోఇవాళ (ఆదివారం) రైతు భరోసాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మంత్రి పొంగులేటి వెల్లడించారు.
పేదోడి కల నెరవేరుస్తాం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదోడి కలలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి చెప్పారు. ఈ మేరకు జనవరి 26న రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే తాము రూ.2 వేలు పెంచి ఏకంగా రూ.12 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి, రోడ్లు కోసం సేకరించిన కొండలు, గుట్టలు, పుట్టలు వంటి భూములకు సైతం రైతు బంధు ఇచ్చిందని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అలాంటి తప్పిదాలకు చోటు లేకుండా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభల ద్వారా రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చొని భూభారతి తయారు చేయలేదని ప్రతిపక్షాలకు ఆయన చురకలు అంటించారు. అలాగే పంటలకు రూ.500 బోనస్ సైతం ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రేషన్ కార్డులు- నిరంతర ప్రక్రియ..
తెలంగాణ ప్రభుత్వ అధికారులు ప్రతి గ్రామానికి వస్తారని, కాంగ్రెస్ సర్కార్ అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తారని మంత్రి పొంగులేటి చెప్పారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్ని ఎకరాలనేది ముఖ్యం కాదని అర్హులకు లబ్ధి చేకూరాలని మంత్రి చెప్పారు. అధికారులు మొక్కుబడిగా కాకుండా రైతును రాజు చేయాలనే తపనతో పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వం పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కానీ ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియని చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఒకే కార్డులో ఒకే పేరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని నిరుపేదకు సైతం రెండు విడతల్లో రూ.12 వేలు ఇస్తామని పొంగులేటి చెప్పారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటి దఫాలో ఇంటి స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని, చిన్నచిన్న పొరపాట్లు కూడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
MLA Kaushik Reddy: దమ్ముంటే రాజీనామా చెయ్.. చూసుకుందాం: కౌశిక్ రెడ్డి సవాల్..