Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో దారుణ ఘటన
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:24 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను ఉరివేసి హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 13: భార్యా, భర్తల మధ్య అనుబంధాలు నీటి బుడగలా మారిపోతున్నాయి. కడదాకా కలిసుంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు చిన్న కారణాలతో విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంతో గుట్టుగా సాగించాల్సిన సంసారాలను నడి బజార్లో పెడుతున్నారు. అంతేకాకుండా క్షణికావేశాలతో, వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాల వల్ల తమ భాగస్వాములను కడతేరుస్తున్న సంఘటనలు ఎన్నో. జీవితాంతం తోడుంటామని చెప్పిన వారే అకారణంగా భార్యా/భర్తల ప్రాణాలను తీస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. వివరాళ్లోకి వెళితే...
జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో దారుణం జరిగింది. భార్య సంధ్య (42)ను తాడుతో ఉరివేసి చంపి ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త బాలరాజు రామాచారి (50). సంధ్య, బాలరాజు రామాచారి భార్యా భర్తలు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే బాలరాజును భార్య, కూతురు కలిసి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరి వేధింపులకు తాళలేక భర్త బాలరాజు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను ఉరివేసి హత్య చేశాడు.
అంతే కాకుండా హత్య చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ తరువాత అతడు కూడా ఉరివేసుకుని చనిపోయాడు. అయితే మొదటి భార్య చనిపోగా సంధ్యను బాలరాజు రెండో వివాహం చేసుకున్నాడు. స్టేటస్ చూసిన బంధువులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
నయా ఎక్స్‌ప్రెస్ వే.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు నిర్మాణం..
జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..
Read Latest Telangana News And Telugu News