Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ నివేదికకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీఅండ్‌ఈ) సమర్పించిన నివేదికకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది.
బ్యారేజీల వైఫల్యానికి 40 మంది కారకులు!
బాధ్యులైన అధికారులపై చర్యలకు లైన్ క్లియర్
నివేదికను తొక్కిపెట్టేందుకు కొందరి ప్రయత్నాలు?
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీఅండ్‌ఈ) సమర్పించిన నివేదికకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. వీటి వైఫల్యానికి కారకులుగా 40 మందికి పైగా అధికారులను విజిలెన్స్ గుర్తించింది. దాంతో ఆ నివేదికలోని అధికారులపై చర్యలకు కమిషన్ ఆమోదం తెలిపినట్లయింది. మరోవైపు నివేదికను తొక్కిపెట్టడానికి కీలక నేతలు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు నిర్దేశిత క్రమపద్ధతిలో జరగలేదని, కుంగిన బ్లాక్-7 పియర్ల కింద ఉన్న పునాది (ర్యాఫ్ట్), దాని దిగువన భూగర్భంలో ఉండే సీకెంట్ పైల్స్‌ను కూడా క్రమపద్ధతిలో నిర్మించలేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే తేల్చింది. పనులు పూర్తికాకపోయినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా నేరపూరిత తప్పిదంగా గుర్తించింది. బ్యాంకు గ్యారంటీల విడుదలలోనూ నిబంధనలు పాటించలేదని నివేదికలో పేర్కొంది. వరదల తరువాత మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని, బ్యారేజీ గేట్లు మూసివేసిన తర్వాత దిగువ భాగంలో కాంక్రీట్ బ్లాకులు, అఫ్రాన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. అయినప్పటికీ మూడేళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టకపోవడంతో 2023 అక్టోబరులో బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిందని గుర్తు చేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు ఏర్పాటు చేసిన విభాగం తన బాధ్యతలు నిర్వర్తించలేదని తేల్చింది.
ప్రభుత్వం నుంచి నిధులు పొంది కూడా..
ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం.. ప్రతి ఏటా వర్షాకాలం ముగిసిన తర్వాత డ్యామ్ అప్రాన్ ఏరియాలో ‘సౌండింగ్ అండ్ ప్రోబింగ్’ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, డ్యామ్ యజమాని (ఈఎన్‌సీ రామగుండం) దీనిని చేపట్టలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. బ్యారేజీ నిర్మాణ సమయంలో షీట్ పైల్స్‌తో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా తొలగించలేదని తెలిపింది. కాఫర్ డ్యామ్ తొలగింపునకు ప్రభుత్వం నుంచి నిధులు పొంది కూడా ఆ పని చేయలేదని, ఆ అవశేషాల వల్ల వరద ప్రవాహం సజావుగా జరగలేదని వివరించింది. ఇందుకు ప్రధాన కారణం నిర్మాణ సంస్థతోపాటు రామగుండం మాజీ ఈఎన్‌సీ, సంబంధిత ఎస్‌ఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లేనని పేర్కొంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తన నివేదికను కాళేశ్వరం విచారణ కమిషన్‌కు కూడా అందించింది. మరోవైపు కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ ఈ నెల 20 తర్వాత తుది దశ విచారణ ప్రారంభించనున్నారు. మే రెండో వారంలో నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఇప్పటికే కమిషన్ సమాచారం ఇచ్చింది. దాంతో ఈ నెలాఖరుతో పూర్తికానున్న కమిషన్ గడువును రాష్ట్రప్రభుత్వం మే నెలాఖరు దాకా పొడిగించనున్నది.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News