Share News

Chakali Ilamma Womens University: అదిరిపోయేలా ఐలమ్మ వర్సిటీ భవనాలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:23 AM

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయ విస్తరణ పనుల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ఇందులో భాగంగా నూతన భవనాలకు సంబంధించి పలు నమూనాలను పరిశీలించగా..

Chakali Ilamma Womens University: అదిరిపోయేలా ఐలమ్మ వర్సిటీ భవనాలు

  • బ్రిటిష్‌ రెసిడెన్సీ మాదిరిగానే నమూనాలు

  • ‘ఆంధ్రజ్యోతి’కి లభించిన ప్రతిపాదిత డిజైన్లు

  • 12 అంతస్తులతో అకడమిక్‌ భవనం

  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఆడిటోరియం

  • 500కోట్లతో చాకలి ఐలమ్మ వర్సిటీ విస్తరణ

  • టెండర్లకు ఆహ్వానం.. సెప్టెంబరులో పనులు

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయ విస్తరణ పనుల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ఇందులో భాగంగా నూతన భవనాలకు సంబంధించి పలు నమూనాలను పరిశీలించగా.. తాజాగా ఒక నమూనాకు అధికారుల ఆమోదం లభించింది. అకడమిక్‌, హాస్టల్‌, గెస్ట్‌హౌస్‌, ఆడిటోరియం భవనాల నమూనాలు ఖరారవడంతో పాటు క్రీడా మైదానం ఎటువైపు ఉండాలన్న దానిని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణాల కోసం తాజాగా టెండర్లను ఆహ్వానించారు. ఆగస్టు మొదటి వారంలో వీటిని ఖరారు చేసి సెప్టెంబరు నుంచి నిర్మాణాలను ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. కొత్త భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.500 కోట్లకు పరిపాలనా అనుమతులను (జీవో ఆర్టీ: 66) మంజూరు చేసింది. అయితే ఇందులో రూ.415కోట్లను విద్యాశాఖ నుంచి తీసుకోనుండగా.. రూ.84.2 కోట్లను కార్పొరేట్‌ సోషల్‌ రె స్పాన్సిబిలిటీ కింద సింగరేణి నుంచి తీసుకోనున్నారు. కాగా, మహిళా వర్సిటీ విస్తరణలో భాగంగా నిర్మించబోయే కొత్త భవనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా భవనాల కోసం రూపొందించిన నమూనాలను ఖరారు చేశారు. ఆ ప్రతిపాదిత డిజైన్లు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి.


బ్రిటిష్‌ రెసిడెన్సీ తరహాలోనే నిర్మాణం..

మహిళా వర్సిటీలో అకడమిక్‌, ఆడిటోరియం, హాస్టల్‌ బ్లాకులను ప్రస్తుతమున్న నిర్మాణాల తరహాలోనే చరిత్రను ప్రతిబింబించేలా నిర్మించనున్నారు. అకడమిక్‌, హాస్టల్‌, గెస్ట్‌హౌస్‌, ఆడిటోరియం, వైస్‌ చాన్స్‌లర్‌ భవనం, సెంట్రల్‌ కిచెన్‌ కలిపి మొత్తం 8,77,668 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. వీటిలో గ్రౌండ్‌తో పాటు 11 అంతస్తులతో నిర్మించనున్న అకడమిక్‌ బ్లాక్‌ 3,00,876 అడుగుల్లో ఉంటుంది. హాస్టల్‌ బ్లాక్‌ను గ్రౌండ్‌ ప్లస్‌ 10 అంతస్తులతో 4,95,013 అడుగుల్లో నిర్మిస్తారు. గ్రౌండ్‌తో పాటు ఒక అంతస్తుతో 31,441 అడుగులతో ఆడిటోరియం, జీ ప్లస్‌ 2 విధానంలో 7,165 అడుగులతో వీసీ భవనాన్ని నిర్మించనున్నారు. 9,356 అడుగులతో జీ ప్లస్‌ 2 విధానంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ 12,900 అడుగులు, స్పోర్ట్స్‌ బ్లాక్‌ను 21,195 అడుగుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. కాగా, నిర్మాణ పనులు రూ.277 కోట్లు, భవనాల సర్వీసుల కోసం రూ.58.69 కోట్లు.. స్థలం అభివృద్ధి, ఫర్నిచర్‌ పనుల కోసం రూ.44.15కోట్లను వెచ్చించనున్నారు. మొత్తంగా ఈ భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లను వెచ్చించనున్నారు. భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే కోర్సులకు కూడా సరిపోయేలా కొత్త భవనాల్లో తరగతి గదులను నిర్మించనున్నారు. జీ ప్లస్‌ 11 అంతస్తుల్లో 110 తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. హాస్టల్‌లో దాదాపు 2,160 మంది విద్యార్థులు ఉండేలా గదులను విశాలంగా నిర్మించనున్నారు. ఆడిటోరియంలో ఒకేసారి 1,200 మంది కూర్చునేలా తీర్చిదిద్దనున్నారు. సెప్టెంబరు నుంచి నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఏయే నెలలో ఎంత మేర పని పూర్తిచేయాలో కూడా అధికారులు లక్ష్యం విధించుకున్నారు.


అప్పటి బ్రిటిష్‌ రెసిడెన్సీ.. ఇప్పటి వర్సిటీ..

ప్రస్తుతం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ ప్రాంగణంలో ఉన్న భవనాలను 1802లో నిర్మించారు. 1924లో అప్పటి నిజాం మహిళల కోసం ప్రత్యేక కాలేజీ ఉండాలని నాంపల్లిలో జెనీనా ఇంటర్మీడియట్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. తర్వాత దానిని 1933లో డిగ్రీ కాలేజీగా ఉన్నతీకరించి, ఉస్మానియా వర్సిటీకి అనుబంధం చేశారు. 1949లో ఈ కాలేజీని కోఠిలోని బ్రిటిష్‌ రెసిడెన్సీలోకి మార్చారు. అప్పుడు దీనిని కోఠి మహిళా విశ్వవిద్యాలయంగా పిలిచేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పేరును చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ గా మార్చడంతో పాటు పలు కొత్త కోర్సులను తీసుకువచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:23 AM