Uttam Kumar Reddy: పదేళ్లు ద్రోహం చేసి ఇప్పుడు నీతులా?
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:11 AM
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందాల వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం
మన వాటా సాధించడంలో విఫలం
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పోరాటం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2015 జూన్‌లో నీటి వాటాల పంపిణీకి ఒప్పందం జరగ్గా... 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు వాడుకోవడానికి, తెలంగాణ కేవలం 299 టీఎంసీలు వాడుకునేలా చేసుకున్న ఒప్పందంపై అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసిందని చెప్పారు. కృష్ణా జలాలను పదేళ్లపాటు పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తోందని ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు టీఆర్‌ఎ్‌స(బీఆర్‌ఎస్) చేసుకున్న ఈ చీకటి ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలను తేల్చాలని పోరాటం చేయకుండా తాత్కాలిక కేటాయింపులకు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం, ఏపీకి 30 శాతం మాత్రమే కేటాయింపులు ఉండాలనే వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌లో లేవనెత్తిందన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్ (3) అంశం తెరపైకి వచ్చిందన్నారు. నదీ జలాల వాటాలు తేల్చకుండా జాప్యం కావడంలో ప్రధాన దోషి బీఆర్‌ఎస్ అని, వాళ్ల హయాంలోనే తెలంగాణకు ద్రోహం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ట్రైబ్యునల్ ద్వారా తొందరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం అనుమతులిస్తే.... బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్లు నటించిందని ప్రశ్నించారు. ఇక గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిందెవరు...? కేసీఆరా...? కాదా...? అని నిలదీశారు.