Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:14 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎన్‌జీఆర్‌ఐ ఆధ్వర్యంలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సర్వే
సమ్మక్కసాగర్ అనుమతులు సాధించాలి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. టన్నెల్ తవ్వకాన్ని బ్లాస్టింగ్ విధానంలో చేయాలని నిర్ణయం తీసుకున్నందునా.. సవరించిన ప్రతిపాదనలకు పరిపాలనపరమైన అనుమతులతో పాటు నిధుల కోసం త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం అనంతరం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సూచనలను అనుగుణంగా పునరుద్థరణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రూట్‌పై అధ్యయనం కోసం డెన్మార్క్‌కు చెందిన కంపెనీతో జియో ఫిజికల్ సర్వే చేయించాలని మంత్రి ఆదేశించారు. రూ.2.36 కోట్లతో వ్యయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ పనులను జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రానికి(ఎన్‌జీఆర్‌ఐ) అప్పగించారు. ఇక, సమ్మక్క సాగర్(తుపాకులగూడెం) ప్రాజెక్టుకు వరద కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో 100 ఎకరాలు ముంపునకు గురవుతుందని ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా.. ఆ 100 ఎకరాల భూమిని సేకరించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆ రాష్ట్రం నుంచి ఎన్‌వోసీ పొందాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ తెస్తేనే డీపీఆర్‌కు అనుమతులిస్తామని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పడంతో వెంటనే ఎన్‌వోసీ పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News