Uttam Kumar Reddy: ప్రాజెక్టుల డిజైన్లపై దృష్టి పెట్టండి: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:44 AM
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను ఆధునికీకరించాలని, సకాలంలో ప్రాజెక్టుల డిజైన్లు అందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను ఆధునికీకరించాలని, సకాలంలో ప్రాజెక్టుల డిజైన్లు అందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పథకం డిజైన్ల త్వరగా ఖరారు చేయాలని సూచించారు. మంగళవారం సీడీవో విభాగంపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్లు, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీడీవోను బలోపేతం చేయడానికి తక్షణమే కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. వందేళ్ల కింద డిజైన్ చేసి, నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉందని, అప్పట్లో డిజైన్లు సిద్ధం చేసిన వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ), జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సిఫారసులతో సీడీవో ప్రతిష్ఠ మసకబారిందని చెప్పారు. సీడీవో పనితీరు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని.. దీనికి ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. నీటిపారుదల శాఖలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు ఉన్నారని, వారిని సీడీవోలో నియమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీడీవోలో సమస్యలపై మంత్రి ఆరా తీయగా.. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పరికరాల కొనుగోలులో జాప్యం జరుగుతోందని, తగిన శిక్షణ కూడా అవసరమని అధికారులు మంత్రికి తెలిపారు. ఆయా అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సీడీవో చీఫ్ ఇంజనీర్‌ను మంత్రి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News