Share News

Urea Supply: రాష్ట్రానికి యూరియా వచ్చేస్తోంది

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:33 AM

రాష్ట్రంలో రైతులెవరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని, ఇప్పటివరకు 14 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందిందని, వారంలో మరో 24 వేల మెట్రిక్‌ టన్నులు రానుందని ..

Urea Supply: రాష్ట్రానికి యూరియా వచ్చేస్తోంది

  • వారంలో మరో 24 వేల టన్నుల యూరియా.. ఇప్పటికే 14 వేల టన్నులు వచ్చింది

  • రైతులెవరూ ఆందోళన చెందవద్దు : మంత్రి తుమ్మల

  • భారీ వర్షాలు, వరదలతో పంట నష్టంపై 5 రోజుల్లో

  • సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులెవరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని, ఇప్పటివరకు 14 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందిందని, వారంలో మరో 24 వేల మెట్రిక్‌ టన్నులు రానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యూరియా గంగవరం, కరైకల్‌, దామ్రా పోర్టుల ద్వారా రానుందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా డిమాండ్‌కు అనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట తక్షణమే అందించేలా అధికారులు, ఉద్యోగులు సమన్వయం చేసుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువు ల విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలు, వరదలతో సంభవించిన పంట నష్టంపై సర్వే నిర్వహించాలని, దీన్ని 5 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.


జిల్లాల్లో రైతుల ఆందోళనలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): యూరియా కోసం రైతులు పగలూ రాత్రీ పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా కోసం ఎగబడుతున్నారు. పలుచోట్ల క్యూ లైన్లలో తోపులాటలతో ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. ఎదురుచూపులతో విసిగి వేసారి ఆందోళన బాట పడుతున్నారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. కొణిజర్ల సొసైటీకి వచ్చిన రైతులు యూరియా సరఫరా కావడం లేదని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇల్లెందు మండలం నిజాంపేటలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ టోకెన్ల పంపిణీ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. దుమ్ముగూడెంలో పీఏసీఎస్‌ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సొసైటీ సిబ్బందిని బయటకు తీసుకొచ్చి గేట్లు వేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట, బిజినేపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వా డ, దేవరకద్ర, జడ్చర్ల, గద్వాలలో రాస్తారోకో చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వందలాది మంది రైతులు, మహిళలు దుకాణాల ఎదుట పడిగాపులు పడ్డారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ సొసైటీ వద్ద పడిగాపులు పడి నీరసించిన గిరిజన మహిళా రైతు రంగమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. రైతులు జఫర్‌గఢ్‌లో రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో తోపులాట జరిగి కొంతమంది రైతులు కిందపడిపోయారు. ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌ నాయక్‌ను రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట క్యూ లైన్‌లో గంటల తరబడి నిల్చుండటంతో ఇద్దరు రైతులు ఫిట్స్‌ వచ్చి పడిపోయారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌, గంగాధర మండలాల్లో, కరీంనగర్‌, జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాబాద్‌లో రైతులు ఆందోళన నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:33 AM