Urea Shortage: సొసైటీ డైరెక్టర్ ఇంట్లో యూరియా స్వాధీనం
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:29 AM
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఓ సొసైటీ డైరెక్టర్ 26 యూరియా బస్తాలను దారి మళ్లించి ఇంట్లో దాచేశాడు. రైతుల ఫిర్యాదుతో అతని బండారం బయటపడింది.
26 బస్తాలు అక్రమంగా నిల్వ.. కేసు నమోదు
రాష్ట్రంలో యూరియా కోసం రైతుల పాట్లు
ఉదయం నుంచి క్యూలో నిల్చున్నా నిరాశే
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఓ సొసైటీ డైరెక్టర్ 26 యూరియా బస్తాలను దారి మళ్లించి ఇంట్లో దాచేశాడు. రైతుల ఫిర్యాదుతో అతని బండారం బయటపడింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపెల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా తిర్మలాయపెల్లిలో గోదాం ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి లారీలో 444 యూరియా బస్తాలు రాగా, అందులో 26 బస్తాలను సొసైటీ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి తన ఇంట్లో దింపుకున్నాడు. మిగతా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారు. రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారు. అయితే, యూరియా బస్తాలు అయిపోగా, టోకెన్లు మిగలడంతో అధికారులు కంగుతిన్నారు. యూరియా బస్తాలు డైరెక్టర్ యాదగిరి ఇంట్లో ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రా రెడ్డి, ఏవో వీరభద్రం, ఏఈవోలు అతని ఇంటికి వెళ్లి చూడగా బస్తాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని యాదగిరిపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఏవో తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల కష్టాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేశారు. నంగునూరు మండలం పాలమాకుల, రాంపూర్, మగ్ధుంపూర్, ముండ్రాయి, ఓబులాపూర్, బద్దిపడగ, నర్మెట్ట, వెంకటాపూర్ తదితర గ్రామాల రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదిక వద్ద టోకెన్లు ఇస్తే, సొసైటీ వద్ద యూరియా బస్తాలు అందజేశారు. పాలమాకులలో పోలీస్ పహారాలో అధికారులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో రైతులు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు యూరియా కోసం పడిగాపులు కాశారు. చెప్పులు లైన్‌లో పెట్టి దాదాపు 500 మంది వేచి చూశారు. చివరికి 410 యూరియా బస్తాలు రావడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. దీంతో దాదాపు 300 మంది రైతులు తీవ్ర నిరాశతో వెనుతిరిగాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీ ఎదుట భారీ సంఖ్యలో రైతులు ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. 500 మందికి పైగా రైతులు క్యూలో నిల్చుని ఉండగా.. 335 బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో అధికారులు, సొసైటీ సిబ్బంది రైతులకు నచ్చచెప్పి.. ముందుగా క్యూలో ఉన్న వారికి యూరియా బస్తాలు ఇచ్చి పంపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News