Farmer Protests: ఉన్నది గుప్పెడు.. సరిపడా ఎప్పుడు?
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:36 AM
పంటల అవసరాలకు దోసిళ్లకొద్దీ డిమాండ్ ఉంటే అందుబాటులో ఉన్న యూరియా పిడికెడంత మాత్రమే! ఫలితంగా చాంతాడంత క్యూలో గంటలకొద్దీ నిల్చున్నా సరుకు దొరుకుతుందన్న నమ్మకం ఉండటం లేదు
యూరియా కొరతతో రైతుల్లో ఆగ్రహజ్వాల.. కొనసాగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు
స్వీయ నిర్బంధాలతో అన్నదాతల నిరసన
సర్కారు అసమర్థత వల్లే కొరత: కేటీఆర్
బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీ కుట్ర: సీతక్క
వారంలో 50వేల టన్నులు: రఘునందన్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): పంటల అవసరాలకు దోసిళ్లకొద్దీ డిమాండ్ ఉంటే అందుబాటులో ఉన్న యూరియా పిడికెడంత మాత్రమే! ఫలితంగా చాంతాడంత క్యూలో గంటలకొద్దీ నిల్చున్నా సరుకు దొరుకుతుందన్న నమ్మకం ఉండటం లేదు. అదృష్టంకొద్దీ దొరికినా అదీ అరకొరనే. ఆ ఒకటి, రెండు బస్తాలతో పంటల అవసరాలేం తీరుతాయి? ఫలితంగా రైతుల్లో అదే కన్నెర్ర.. ఆగ్రహజ్వాల! ఎరువుల కేంద్రాల వద్దే నిరసనలు.. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం యూరియా కోసం మహబూబాబాద్-తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. నాలుగు రోజుల క్రితమే టోకెన్లు తీసుకున్న రైతులు ఉదయం నుంచి క్యూలో నిల్చునా యూరియా ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు లక్ష్మాతండా రైతు భూక్య గోప.. పురుగుల మందు డబ్బాతో ఆందోళన కార్యక్రమానికి రాగా పోలీసులు అతడి నుంచి దాన్ని లాక్కున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా దొరకనందుకు నిరసనగా రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్వీయ నిర్బంధం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలోనూ క్యూలైన్‌లో చెప్పులు పెట్టారు.
అసమర్థులు రాజ్యమేలడంతోనే..
పాలనతెలియని అసమర్థులు రాజ్యమేలుతుండటంతోనే వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని, తెలంగాణ రైతన్నలను కాంగ్రెస్ అరిగోస పెడుతోందని.. ఆ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలవల్లే రాష్ట్రంలో యూరియా సంక్షోభం ఏర్పడిందని శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బూతులు మాట్లాడడం తప్ప చేతలు లేని ఢిల్లీపార్టీల నాయకులకు, విజన్ ఉన్న కేసీఆర్ పకడ్బందీ పాలనకు మధ్యతేడా ఏమిటన్నది తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు. కాగా సాగు అవసరాలకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ న్యూడెమోక్రసీ నాయకులు కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
బీఆర్‌ఎ్‌సతో కలిసి బీజేపీ కుట్ర
రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ.. రాష్ట్రానికి యూరియాను కేటాయించకుండా, బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు, యూరియా రాకుండా రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, సకాలంలో అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియాను కేటాయించాలని రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు పార్లమెంట్‌లో, పార్లమెంట్ బయట డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణా లోపం వల్లే
రాష్ట్రానికి వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడారు. యూరియా విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. వారి మాటలు విని రైతులు ఆందోళన పడొద్దని సూచించారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ లోపమే కారణమన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా మంచిగా వచ్చిందని. రేవంత్ వస్తే యూరియా రావడంలేదని.. యూరియా ఇస్తేనే ఓట్లేస్తాం అంటూ రాజకీయాలు మాట్లాడటం సరికాదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది మోదీయేనని, రేవంత్‌కు యూరియా ఇచ్చేది కూడా మోదీయేనని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News