Farmer Struggles: యూరియాకు ఇతర ఎరువుల లంకె!
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:47 AM
రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతను ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సీలింగ్, నిబంధనలు విధించుకుంటూ రైతులను దోచుకుంటున్నారు.
వేరే ఎరువులు కొంటేనే యూరియా అమ్ముతామంటున్న ప్రైవేటు వ్యాపారులు
రైతులపై అదనపు భారం..సాగు సీజన్ కావడంతో దుకాణాల వద్ద రైతుల బారులు
మహబూబ్‌నగర్/కోల్‌సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతను ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సీలింగ్, నిబంధనలు విధించుకుంటూ రైతులను దోచుకుంటున్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులకు ఇతర ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయాలని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పత్తి, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు కలుపు తీసే దశలో ఎరువులు వేయాల్సి ఉండగా.. వరి నాట్లు వేసే రైతులు ప్రారంభంలోనే అధిక ఎరువులు కొనుగోలు చేస్తారు. బోరు బావుల కింద వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నాట్లు పూర్తిచేసుకుని కలుపు దశకు చేరుకోగా.. సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టులో నాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి రాష్ట్రం కోరిన మేరకు కేంద్రం ఎరువులను కేటాయించలేదని ప్రభుత్వం చెబుతోంది. కేటాయించిన ఎరువుల్లో సగం కూడా సరఫరా చేయలేదని ఆక్షేపిస్తోంది.
ఈ క్రమంలోనే సింగిల్ విండోలు, ఆగ్రో్‌సలలో ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సీలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదే అదునుగా చేసుకుని ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారు. ఒక్కో యూరియా బస్తా ధర 266.60 కాగా.. సింగిల్ విండోలు, ఆగ్రో్‌సలో అంతే మొత్తం తీసుకుంటున్నారు. కానీ ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో రూ.50 నుంచి రూ.75 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే డీఏపీ, 20-20-13, 14-35-14, 28-28-0 కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సిందిగా లంకె పెడుతున్నారు. అవి కొనుగోలు చేస్తేనే యూరియా బస్తాలు ఇస్తామనే నిబంధన పెట్టడంతో రైతులు అవసరం లేకున్నా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులోనూ అవసరం లేని ఎరువులకు అధికంగా ధర ఉండటంతో రైతులపై అదనపు ఆర్థికభారం పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)లో అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీతో గురువారం ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ప్లాంట్‌ను వెంటనే మూసేశారు. కేటాయించిన మేరకు కేంద్రమూ ఇవ్వక.. ఇటు సాంకేతిక వైఫల్యాలతో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ