Share News

Gender Determination: స్కానింగ్‌ కేంద్రాలపై పర్యవేక్షణేది?

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:50 AM

రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుమతుల్లేకుండా అలా్ట్రస్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తూ..

Gender Determination: స్కానింగ్‌ కేంద్రాలపై పర్యవేక్షణేది?

  • తూతూ మంత్రంగా పీసీపీఎన్‌టీడీ తనిఖీలు

  • సంఘటనలు జరిగితేనే హడావుడి.. రాష్ట్రంలో 4,180 కేంద్రాలు

  • వీటిలో నెలకు 10 శాతం కేంద్రాల్లో కూడా తనిఖీలు జరగట్లే

  • యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేస్తున్న వైనం

  • కేంద్రాల్లో అనుమతుల్లేకుండానే స్కానింగ్‌ యంత్రాలు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుమతుల్లేకుండా అలా్ట్రస్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తూ.. ఇష్టారాజ్యంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కానింగ్‌ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. స్కానింగ్‌ కేంద్రాలపై పర్యవేక్షణకు ఉద్దేశించిన పీకాన్సెప్షన్‌ ప్రీనాటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌(పీసీపీఎన్‌డీటీ) చట్టం-1994 పకడ్బందీగా అమలు కావడంలేదనే విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో.. ఫర్టిలిటీ, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 4,180 కేంద్రాలు

తెలంగాణ వ్యాప్తంగా పీసీపీఎన్‌డీ చట్టం కింద అనుమతి పొందిన ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు 4,180 వరకు ఉన్నాయి. వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. నెలకు సగటున 33ు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. అంటే.. ప్రతి కేంద్రాన్ని మూణ్నెల్లకోసారి తనిఖీ చేయాల్సి ఉన్నా..10ు కేంద్రాల్లో కూడా తనిఖీలు జరగడం లేదని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. మే నెలలో 1,392 కేంద్రాల్లో తనిఖీలు చేయాలని టార్గెట్‌ విధిస్తే కేవలం 422 కేంద్రాల్లో ఇన్‌స్పెక్షన్లు మాత్రమే నమోదయ్యాయి. జూన్‌ నెలలో 533 కేంద్రాలను సందర్శించారని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా సర్కారుకు అందజేసిన నివేదిక స్పష్టం చేస్తోంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో 57% కేంద్రాలు

రాష్ట్రంలోని స్కానింగ్‌ కేంద్రాల్లో 57% గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 908, రంగారెడ్డిలో 609, మేడ్చల్‌లో 872 కేంద్రాలున్నాయి. ఆ తర్వాత అత్యధిక కేంద్రాలున్న జాబితాలొ హనుమకొండ (179), కరీంనగర్‌ (145), ఖమ్మం (104), సం గారెడ్డి (128), నిజామాబాద్‌ (126) జిల్లాలున్నాయి. గ్రేట ర్‌ హైదరాబాద్‌లో 797 కేంద్రాలు తనిఖీ చేయాల్సి ఉన్నా.. 124 మాత్రమే చేస్తు న్నారు. ములుగు, మెదక్‌, హనుమకొండ, నాగర్‌కర్నూల్‌, భూపాలపల్లి జిల్లాల్లోనే పీసీపీఎన్‌డీటీ తనిఖీలు లక్ష్యాలకనుగుణంగా కొనసాగుతున్నాయి.


ఫర్టీలిటీ, సరోగసి పేరుతో మోసం

ఫర్టిలిటీ, సరోగసి పేరుతో సంతాన సాఫల్య కేంద్రాల మోసాలు తీవ్రమవుతున్నాయని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంతానం కోసం వచ్చే దంపతుల శరీర ఛాయ ఆధారంగా వారికి పుట్టబోయే బిడ్డలు కూడా అదే రంగులో ఉండేలా కొన్ని కేంద్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందుకోసం నలుపు, ఎరుపు, బ్రౌన్‌ రంగుల వ్యక్తుల వీర్యకణాలను సేకరించి పెట్టుకుంటున్నాయని తెలిపాయి. సరోగసి ప్రసవాలు కూడా పెరుగుతున్నట్లు వివరిస్తున్నాయి. అధికారికంగా 50 వరకు సరోగసి అనుమతులు ఉంటుండగా.. అనధికారికంగా వీటి సంఖ్య వెయ్యికిపైగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత నెల 8న భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిపై రాచకొండ పోలీసులు తనిఖీలు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా లింగానిర్థారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ డాక్టర్‌తో పాటు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఆ ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తి జరుగుతున్నట్లు తేల్చారు. ఆడ శిశువుల పిండాలను సీజ్‌ చేసి, డీఎన్‌ఏ టెస్టుల కోసం పంపారు. ఆ ఆస్పత్రిపై పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.


సికింద్రాబాద్‌లోని న్యూలైఫ్‌ ఆస్పత్రిలో

అనధికారికంగా అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాన్ని వాడుతున్నట్లు గుర్తించారు. ఆ ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. సైదాబాద్‌లో వివేక్‌ ఆస్పత్రిలో అనుమతుల్లేని రెండు అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలను గుర్తించి, రూ.2 లక్షల జరిమానా విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 11:31 AM