Share News

London Accident: లండన్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు హైదరాబాద్‌ యువకుల దుర్మరణం

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:35 AM

లండన్‌లో వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు చనిపోయారు. ఐదుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది...

London Accident: లండన్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు హైదరాబాద్‌ యువకుల దుర్మరణం

  • ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

  • గణేశ్‌ నిమజ్జనానికి వళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌

  • వీరు వెళ్లిన రెండు కార్లూ ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం

సరూర్‌నగర్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లండన్‌లో వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు చనిపోయారు. ఐదుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. మృతులను నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య(23), బోడుప్పల్‌కు చెంది రాపోలు రిషి తేజ(21)గా గుర్తించారు. రావుల సాయిగౌతమ్‌, తాటికాయల నూతన్‌, గుర్రం యువతేజ రెడ్డి, గొల్ల వంశీ, పెంట్యాల వెంకట సుమంత్‌ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో గౌతమ్‌, నూతన్‌ పరిస్థితి విషమంగా ఉంది. నాదర్‌గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, తర్రె మంగమ్మల చిన్న కుమారుడు చైతన్య. బీటెక్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఫిబ్రవరి మొదటివారంలో క్రితం లండన్‌ వెళ్లాడు. అతడు, తన 8మంది స్నేహితులు ఆదివారం లండన్‌లో తాము ఉంటున్న ప్రాంతంలో వినాయకుడి శోభా యాత్ర నిర్వహించారు. తర్వాత, స్థానికంగా ఉన్న చెరువులో గణేశుడిని నిమజ్జనం చేయడానికి రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా, వీరి రెండు కార్లే అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో చైతన్య, రిషి తేజ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చైతన్య చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ప్రమాదం సమయంలో కార్లను డ్రైవింగ్‌ చేసిన బట్టమేకల గోపీచంద్‌, సబ్బాని మనోహర్‌లు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం రాత్రి తమ ఇంటి సమీపంలోని మండపంలో వినాయకుడి పూజ పూర్తైన సమయంలోనే, తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైనట్లు ఫోన్‌వచ్చిందని చైతన్య తండ్రి ఐలయ్య రోదిస్తూ చెప్పారు. ఆ తర్వాత గంట సేపటికి మళ్లీ ఫోన్‌ చేసి చనిపోయినట్లు చెప్పారన్నారు. చైతన్య మృతదేహాన్ని రెండు రోజుల్లో నాదర్‌గుల్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా తాము కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విషయం చెప్పామని, ఆయనతో పాటు ఇతర నేతలు కూడా లండన్‌ అధికారులతో మాట్లాడారని నాదర్‌గుల్‌కు చెందిన బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:35 AM