Share News

Tummla: డిఫాల్టర్లకు కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రుణాలివ్వరా?

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:32 AM

రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

Tummla: డిఫాల్టర్లకు కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రుణాలివ్వరా?

  • అన్నదాతలు సకాలంలో చెల్లించకపోతే ప్రహరీ గేట్లు ఊడదీసుకొని పోతారా?

  • ఇదెక్కడి విధానం?: మంత్రి తుమ్మల

  • రైతులకు నాబార్డ్‌ విరివిగా రుణాలు ఇవ్వాలి: భట్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు కోట్లలో రుణాలు ఇస్తున్నారని, రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఇంటి ప్రహరీ గేట్లను ఊడదీసుకొని పోతున్నారని.. ఇదెక్కడి విధానం? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డు సీజీఎం ఉదయ భాస్కర్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతులకు రుణాలివ్వడంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, వారికి విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. కోతుల మందలు పంటలపై విరుచుకుపడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కోతుల బెడద తప్పేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ విధానం మేలు అని.. ఇందుకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురావాలన్నారు. అనంతరం భట్టి మాట్లాడారు. రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్రంలో మామిడి, పసుపు, మిర్చి, చిరుధాన్యాలు ఎక్కువగా సాగవుతాయని, వీటి కోసం కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్‌ శివారు గ్రామాల్లో పూలసాగును ప్రోత్సహించేందుకు రుణం అందించాలని నాబార్డుకు సూచించారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని, వీటన్నింటినీ సౌర విద్యుత్తు పంపుసెట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, వీటికి నాబార్డు రుణాలు అందించాలని సూచించారు.


పంట రుణాలకు రూ.87వేల కోట్లు

రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు రూ.3.86 లక్షల కోట్ల రుణ అవసరాలు ఉంటాయని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక కన్నా 37.8 శాతం ఎక్కువ అని పేర్కొంది. ఈ మేరకు తన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆయా రంగాలవారీగా అందించనున్న రుణాలను నాబార్డు ప్రతినిధులు వెల్లడించారు. రుణ ప్రణాళకలో భాగంగా వ్యవసాయ రంగానికే రూ.1.63 లక్షల కోట్ల రుణ అవసరాలు ఉంటాయని, వీటిలో పంట రుణ అవసరాలకు రూ.87వేల కోట్లు అని వివరించారు. వ్యవసాయ సంబంధిత నిర్వహణ మూలధనం కింద రూ.7వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల టర్మ్‌ లోన్ల కింద రూ.69 వేల కోట్ల మేర రుణ అవసరాలుంటాయని తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించామని, వీటికి రూ.2.03 లక్షల కోట్ల రుణాలు, ఇతర పారిశ్రామిక ప్రాధాన్య విభాగాలకు రూ.19 వేల కోట్ల రుణ అవసరాలు ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 04:32 AM