Tummala: కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీల్లో కూర్చోవాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:13 AM
కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీల్లో కూర్చోవాలని, అందుకోసం పార్టీ శ్రేణులు కష్టపడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. త్వరలో జగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు.

ఇందుకు పార్టీ శ్రేణులు కష్టపడాలి: తుమ్మల
ఖమ్మం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతిప్రతినిధి): కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీల్లో కూర్చోవాలని, అందుకోసం పార్టీ శ్రేణులు కష్టపడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. త్వరలో జగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రజా ఆమోదంతో పాటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలనే అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎన్నికల్లో నిలబెడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మంలో ఖమ్మం అసెంబ్లీ నియోజవర్గస్థాయి సమావేశాన్ని మంత్రి తుమ్మల ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించనుందని, ముందుగా మండల స్థాయి ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కేవలం పదిరోజుల షెడ్యూల్ వ్యవధిలోనే పూర్తి చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రాణాలను ఫణంగాపెట్టి కాంగ్రె్‌సను గెలిపించిన కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీలో కూర్చుంటే ప్రభుత్వానికి, పార్టీకి ఆగౌరవం దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడ ప్రత్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందని, అలాంటివారు ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా సాగనివ్వరన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని ఆయన సూచించారు.