Tummala: ప్రపంచ వాణిజ్యానికి చిరునామా తెలంగాణ: తుమ్మల
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:25 AM
ప్రపంచ వాణిజ్యానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్/కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వాణిజ్యానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లులుమాల్‌లోని లులు హైపర్‌మార్కెట్‌ను బీసీసీ (బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ప్రతినిధుల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ధాన్యాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఎగుమతులు, దిగుమతుల అంశాలపై చర్చించామన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో తెలంగాణను మరింత ముందుకుతీసుకెళ్లే విషయంలో లులు హైపర్‌మార్కెట్ కీలకపాత్ర పోషించేందుకు ముందుకురావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను కొనసాగించడం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ క్షేత్రస్థాయి సందర్శన ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహ్రెయిన్ బృందంలోని మహ్మద్ ఆల్కోహేజీ, అబ్దుల్ రహ్మాన్, మహ్మద్ అల్ గౌద్.. లులుమాల్‌లో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లులు గ్రూప్ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖదీర్, రీజనల్ మేనేజర్ మహ్మద్ షరీఫ్, మాల్ మేనేజర్ ఇజల్ అర్షన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు అసత్యప్రచారం మానాలి..
బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడడం ఆపాలని.. లేదంటే తెలంగాణ సమాజం మరోసారి కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉందని తుమ్మల అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత రైతుల సమస్యలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. ఏడాది కాలంలోనే సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.55,256 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతులు పండించే ప్రతీ పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక కందుల కొనుగోలు కోసం 41 కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, రూ.7.21 కోట్లతో 954.95 మెట్రిక్ టన్నుల కందులను మద్దతు ధరకు కొనుగోలు చేశామని వెల్లడించారు. కాగా, అంతకుముందు మిర్చి, కందుల కొనుగోళ్లపై సచివాలయంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో సమీక్షించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News