Share News

గ్రూప్‌-1 మూల్యాంకనంలో ఎలాంటి లోపాల్లేవు

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:04 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలియజేసింది. అంతేకాక మెయిన్స్‌ పరీక్షను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వివరించింది.

గ్రూప్‌-1 మూల్యాంకనంలో ఎలాంటి లోపాల్లేవు

  • పారదర్శకంగా మెయిన్స్‌ :టీజీపీఎస్సీ

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలియజేసింది. అంతేకాక మెయిన్స్‌ పరీక్షను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వివరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం, అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు, తుది అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించగా.. టీజీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం మూడు దశల్లో సాగుతుందని ఆయన ధర్మాసనానికి తెలిపారు. తొలుత ఒక ఇవాల్యుయేటర్‌ మూల్యంకనం చేసిన పత్రం ఆ తర్వాత మరో ఇవాల్యుయేటర్‌ వద్దకు వెళుతుందని చెప్పారు.


ఈ రెండు దశల్లో వచ్చిన మార్కుల్లో తేడా ఉండే ఆ సమాధన పత్రం మూడో ఇవాల్యుయేటర్‌ దగ్గరకు వెళ్తుందని పేర్కొన్నారు. తాము ఎవరి సమాధాన పత్రంను దిద్దుతున్నామనేది ఇవాల్యుయేటర్లకు తెలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇక, ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకు ఇచ్చారు అనే అంశంపై రచనా రెడ్డి అనే న్యాయవాది మాత్రమే పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా వేర్వేరు హాల్‌ టికెట్లు జారీ చేయడం కొత్త విధానం కాదని.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎంపిక ప్రక్రియల్లో కూడా ఈ విధానం ఉందని ధర్మాసనానికి తెలియజేశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే వీలు లేకుండా బయోమెట్రిక్‌ గుర్తింపు, నామినల్‌ రోల్స్‌ ఉంటాయని చెప్పారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. టీజీపీఎస్సీ పారదర్శకతపై అనుమానం వ్యక్తం చేశారు. నియామక పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని కొంతమంది ఎంపికైన అభ్యర్థులు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.


నకిలీ న్యాయవాదుల తొలగింపు

తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి న్యాయవాదులుగా ఎన్‌రోల్‌ అయిన 9 మంది పేర్లు తొలగిస్తూ బార్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆ వివరాలను వెల్లడించింది. సదరు న్యాయవాదులు సమర్పించిన విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు నకిలీవని కౌన్సిల్‌కు నివేదికలు అందాయని పేర్కొంది. దీనిపై సదరు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టామని తెలిపింది. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ రూల్‌-42 ప్రకారం ఆ 9 మందిపై చర్యలు చేపట్టిందని వెల్లడించింది. వారి పేర్లను వెంటనే రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ జాబితా నుంచి తొలగించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి ..అజర్‌ శ్రావణ్‌ కుమార్‌, ఎం.సురేఖా రమణి, ఎన్‌.విద్యాసాగర్‌, పి.సిసిల్‌ లివింగ్స్టన్‌, సతీశ్‌ కనకట్ల, నరేశ్‌ సుంకర, రాజశేఖర్‌ చిలక, శ్రీశైలం.కె, ఎ.ఉదయ్‌ కిరణ్‌ను తొలగించారు.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:04 AM