Secretary Shafiyullah: పారదర్శకంగా హాస్టళ్ల ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:29 AM
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలతో పాటు వసతి గృహాల్లో ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పారదర్శకంగా
నిత్యావసరాల కొనుగోలుపై అధికారుల సమీక్ష
హైదరాబాద్, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలతో పాటు వసతి గృహాల్లో ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయుల్లా సూచించారు. సచివాలయంలో మంగళవారం సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలకు ఈ విద్యాసంవత్సరానికి అవసరమైన నిత్యావసరాలు, ఇతర సరకుల సేకరణపై మార్గదర్శకాల రూపకల్పనకు సంబంధించిన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ సమావేశం జరిగింది. నాణ్యమైన వస్తువులను స్థానిక ధరలకు అనుగుణంగా, సకాలంలో సరఫరా చేసేవిధంగా చూడాలని ఆయన సూచించారు. టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మోనిటరింగ్ యూనిట్ ఛైర్‌పర్సన్ డా. వి. ఎస్.అలగు వర్షిణి, బీసీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శులు సైదులు, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.